BJP Leader Purandeshwari on Government Schemes Names of Inspirational Leaders : ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. భావి తరాలకు ఆదర్శనీయులైన, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్ర విద్యాశాఖలోని పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పురందేశ్వరి అభినందించారు.
మంచి సంప్రదాయం : పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అమలు చేయడం మంచి సంప్రదాయమని పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశం చేస్తుందని తెలిపారు.
స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం- పవన్ - Pawan on Govt Schemes Names
భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం: మధ్యాహ్న భోజన పథకానికి- ఒక నాటి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని పురందేశ్వరి పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశమేనన్నారు. అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారన్నారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు ఎన్డీయే ప్రభుత్వానికి ఉంటాయని పురందేశ్వరి ఆకాంక్షించారు