Bike Racing and Stunts in Hyderabad IT Corridor : హైదరాబాద్ ఐటీ కారిడార్ రాత్రిపూట పోకిరీలకు అడ్డాగా మారుతోంది. నగరం నలుమూలల నుంచి ద్విచక్రవాహనాలు, కార్లపై వచ్చే ఆకతాయిలు, టీ హబ్ రోడ్డులో ప్రమాదకర స్టంట్లు, రేసింగ్ నిర్వహిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. వీకెండ్స్, పండుగలు సమయాల్లో ఐటీ హబ్‌కు చేరుకుని నడి రోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొందర్ని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నా, ఎప్పటికప్పుడు పాత కథే పునరావృతమవుతోంది.
విపరీతంగా బైక్ స్టంట్లు : విశాలమైన రోడ్లు, ఇరువైపులా అద్దాల మేడల్లాంటి భవనాలు, దూసుకెళ్లేందుకు అనువైన దారి, అడ్డుకోవడానికి పోలీసులకు వీలుకాని పరిస్థితి ఇవే ఐటీ కారిడార్లో పోకిరీలు స్టంట్లు వేసేందుకు కారణమవుతున్నాయి. ప్రధానంగా టీ-హబ్, అరవింద్ గెలాక్సీ మార్గంలో బైక్ స్టంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆకతాయిలు విన్యాసాలు చేస్తుంటే వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి వందలాది మంది యువత ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివస్తున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో రీల్స్, షార్ట్స్ కోసం బైకర్లు వెర్రితలలు వేస్తున్నారు.
బైక్ స్టంట్స్ రీల్స్ చేస్తూ యువకుడు మృతి - తల్లడిల్లిన తల్లి ప్రాణం - Bike Stunts video
ఆ మార్గాల్లో రేసింగ్‌లు : హైదరాబాద్ నగర నలుమూలల నుంచి వాహనాలతో వస్తున్నా స్టంట్లు చేసే రహదారులు రెండే ఉన్నాయి. మొత్తం ఐదు మార్గాల గుండా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడే పికెటింగ్ ఏర్పాటు చేసి ఆకతాయిలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేబుల్ బ్రిడ్జి మీదుగా ఐటీసీ కోహినూర్ నుంచి వచ్చే మార్గం, సత్వా నాలెడ్జ్ సిటీ నుంచి వచ్చే మార్గం, ఇమేజ్ టవర్స్, మైహోం స్కై వ్యూ నుంచి వచ్చే మార్గం, రాయదుర్గం నుంచి టీ హబ్ వైపు వచ్చే మార్గాల్లో ఈ రేసింగ్‌లు జరుగుతున్నాయి.
156 ద్విచక్రవాహనాలు స్వాధీనం : వారాంతపు ఐటీ కారిడార్లో రద్దీ తక్కువగా ఉంటుండటంతో.. కొందరు ఐటీ ఉద్యోగుల పేరుతో ఇక్కడికి చేరుకుంటున్నారు. రాత్రి 9 గంటల తర్వాత పికెటింగ్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు పరిశీలించి పంపిస్తే సగానికి సమస్య తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ బైక్ రేసింగ్‌ల విషయంలో నగరంలో నమోదైన కేసులు 250 కాగా 156 ద్విచక్రవాహనాలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బైక్‌లపై క్రాకర్స్ పేల్చుతూ యువత స్టంట్స్- లైవ్ వీడియో చూశారా?