Nellore Teacher Bhaskar Rao Story : వీల్‌ఛైర్‌ను నెట్టుకుంటూ వస్తున్న ఈయనే మేకల భాస్కర్‌రావు. పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడినా నిరాశ పడలేదు. కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. 24 ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు కొండాయపాలెం వద్ద నగరపాలక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనకున్న విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించాలనేదే ఆయన తపన. ప్రతీరోజూ మూడు చక్రాల సైకిల్‌పై పాఠశాల సమయానికి ముందే భాస్కర్‌రావు వచ్చేస్తారు.
భాస్కర్‌రావు మాస్టారు వస్తున్నారంటే చాలు పిల్లలందరూ సార్ సార్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆయన చుట్టూ చేరతారు. ఈ గురువు బడిలోనే ఎక్కువ సమయం గడుపుతారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధపెట్టి అదనపు తరగతులు చెబుతూ వారికే సమయం కేటాయిస్తారు. అంతేకాదు విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పడు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తుంటారు. అదేవిధంగా పేదకుటుంబం నుంచి తాను ఉపాధ్యాయుడి వృత్తిలోకి వచ్చిన విధానాన్ని చెప్పి వారిలో ప్రేరణ కలిగిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ తోటి ఉపాధ్యాయులతో కలిసి బోధన చేస్తున్నారు.
వృత్తి పట్ల అంకితభావమే భాస్కర్‌రావును ముందుకు నడిపిస్తోంది. పాఠాలు చెప్పడమొక్కటే కాదండోయ్ బడి బాగోగులను ఈయనే చూసుకుంటారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ద్వారానే కాకుండా దాతల సాయంతోనూ బడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రత్యేకతలే ఆయణ్ని బెస్ట్ టీచర్‌గా నిలిపాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా 2023లో భాస్కర్‌రావు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు.
"రాష్ట్రపతి చేతుల మీదుగా 2023లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నాను. పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు అందుకున్నాను. దాతలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకున్నాం. మా విద్యార్థులు చదువులో చురుకుగా ఉంటున్నారు. అందుకు నాకు సంతోషంగా ఉంది." - మేకల భాస్కర్‌రావు , ఉత్తమ ఉపాధ్యాయుడు
Teachers Day Special Story 2024 : మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ భాస్కర్‌రావు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓ వైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే సమాజంపై, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్నతి కోసం ఆర్థికసాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అందుకే భాస్కర్‌రావు మాస్టారు అంటే అందరికీ ఫేవరేట్.