Pensions Distribution Issue in AP: ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే రకరకాల సాకులు చెప్పి జాప్యం చేసి వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వింతవులను రోడ్ల మీదకు రప్పించి నానా తిప్పలు పెట్టింది. గురువారం పింఛన్ల పంపిణీలో ఎండ వేడమికి తట్టుకోలేక నీరసించి, అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జనపరెడ్డి అప్పలనరసమ్మ బుధవారం పింఛను వస్తుందో లేదోననే ఆందోళనతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన పాతకోకల పెద్దిరాజు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి బయల్దేరి దారిలో ఆయాసం రావడంతో కుప్పకూలిపోయి చనిపోయారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన పింఛనుదారుడు అన్నలదాసు మార్క్ బుధవారం రెండుసార్లు సచివాలయానికి వెళ్లినా పింఛన్ అందలేదు. దీంతో ఒత్తిడి గురై అర్ధరాత్రి ఆయాసంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రం గాజులనగరానికి చెందిన ఈశ్వరమ్మ వితంతు పింఛను కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో సచివాలయానికి వెళ్తుండగా దారిలో మృతి చెందింది.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చుక్కావారిపల్లె గ్రామానికి చెందిన మురుగేష్ పింఛన్ ఇచ్చేందుకు ఇంటికి ఎవరూ రాకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామభద్రాపురానికి కాలినడకన బయల్దేరాడు. దారిలో అదుపుతప్పి రాళ్లపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గిరిశిఖర దారపర్తి పంచాయతీ పాతచెలకపాడు గ్రామానికి చెందిన జన్ని గుడ్లయ్య పింఛను డబ్బుల కోసం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డవర సచివాలయానికి కాలినడకన బయలుదేరి ఎండకు సొమ్మసిల్లి పడిపోయాడు. అభయహస్తం పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షలమంది ఉంటే చాలాచోట్ల వీరికీ పింఛను పంపిణీ జరగలేదు.
బుధవారం, గురువారం రెండురోజులూ వీరు దూరప్రాంతాల నుంచి సచివాలయాలకు వచ్చి వేచి చూసి చూసి పింఛను సొమ్ము తీసుకోకుండానే వెనుదిరిగారు. కనీసం ఎందుకు వారికి పింఛను ఇవ్వలేదో కూడా అధికారులు స్పష్టం చేయలేదు. నిధులు విడుదల చేసినట్లు చూపుతున్నా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందించిన పింఛను జాబితాలో వీరి పేర్లు ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే కాలేదు.
దీంతో సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రమ్మని చెప్పి అభయహస్తం పింఛనుదారుల్ని వెనక్కి పంపించేశారు. అమరావతిలో భూములు లేని పేదలపైనా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపునకు దిగింది. వీరు దాదాపుగా 17వేల 215మంది ఉన్నారు. పంపిణీ మొదలు పెట్టి రెండు రోజులైనా పింఛను అందించలేదు. ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చూపి నిలిపేసినట్లు తెలిసింది.
చాలామంది పేదలు పింఛను కోసం సచివాలయాలకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. గురువారం రాత్రి 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 88 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. పింఛనుదారులు 65.69 లక్షల మంది ఉండగా 57.81 లక్షల మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 92 శాతం పూర్తయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 75.25 శాతంగా నమోదైంది. మిగతా జిల్లాల్లో 80 శాతానికి పైగా పంపిణీ జరిగింది.