Balapur Ganesh Laddu Auction 2024: తెలంగాణలోని బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేలంపాటకు పోటీదారుల నుంచి డిమాండ్ పెరిగిన దృష్ట్యా బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికులైనా, స్థానికేతరులైనా లడ్డూ వేలం పాటలో పాల్గొనాలంటే గతేడాది వేలంపాట ఎంత వరకు వెళ్లిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలని నిబంధన విధించింది. ఆ తర్వాతే పోటీదారులను వేలంపాటలో పరిగణలోకి తీసుకుంటామని ఉత్సవ సమితి వెల్లడించింది. తీవ్రమైన పోటీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది లడ్డూవేలం 30 లక్షల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
లడ్డూ వేలం పాటకు నిబంధనలు: గత సంవత్సరం ఇక్కడి లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. ఈ సంవత్సరం లడ్డూ వేలంలో పాల్గొనాలంటే ఉత్సవ సమితి సూచించిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 27 లక్షలు డిపాజిట్ చేస్తేనే లడ్డూ వేలంపాటకు అర్హత ఉంటుందని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడు తమకు కటాక్షం ఇవ్వాలని భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ అంటే లడ్డూ మాత్రమే కాదు, ప్రతిసారి ప్రత్యేకమైన సెట్ ఒకటి ఉంటుంది. అది జనాల దృష్టిని ఆకరించేలా ఉంటుందని ఈసారి నిర్మించిన అయోధ్య సెట్ స్పష్టం చేస్తోంది.
1994లో వేలంపాట ప్రారంభం: మరోవైపు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. మొదట రూ.450తో ఈ వేలం పాట ప్రారంభమయింది.
- 1996 - 18,000/-
- 1997 - 28,000/-
- 1998 - 51,000/-
- 1999 - 65,000/-
- 2000 - 66,000/-
- 2001 - 85,000/-
- 2002 - 1,05,000/-
- 2003 - 1,55,000/-
- 2004 - 2,01,000/-
- 2005 - 2,08,000/-
- 2006 - 3,00,000/-
- 2007 - 4,15,000/-
- 2008 - 5,07,000/-
- 2009 - 5,10,000/-
- 2010 - 5,35,000/-
- 2011 - 5,45,000/-
- 2012 - 7,50,000
- 2013 - 9,26,000/-
- 2014 - 9,50,000/-
- 2015 - 10,32,000/-
- 2016 - 14,65, 000
- 2017 - 15, 60,000
- 2018 - 16,60,000
- 2019 - 17,60,000
- 2020 - కరోనా కారణంగా వేలం పాట రద్దు
- 2021 - 18,90,000
- 2022 - 24,60,000
- 2023 - 27,00,000
ఉదయం 9.30 గంటలకు ప్రారంభం: బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేలంపాట ప్రారంభం కానుంది. 11 గంటలకు ట్యాంక్ బండ్ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది.