Ayyanna Patrudu Unanimously Elected as Speaker of AP Assembly Speaker : అయన్నపాత్రుడు ముక్కుసూటిగా మాట్లాడతారు. కచ్చితత్త్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని నేటి వరకూ ఆయన వీడలేదు. తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్లు పక్క చూపులు చూసినా ఆయన పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతినకుండా ధైర్యవచనాలు చెప్పారు. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే నేడు స్పీకర్ పదవి ఆయన్ని వరించింది.
హిందూ కుటుంబానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టెంబరు 4న ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో జన్మించారు. అయ్యన సతీమణి పద్మావతి. వీరికి విజయ్, రాజేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా (MLA) గా ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా కూడా పని చేశారు. 11వ లోక్‌సభకు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏడు సార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో 24 వేల 646 మెజారిటీతో విజయం సాధించారు.
స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ - అయ్యన్న ఎన్నిక లాంఛనమే - Ayyanna Patrudu became Speaker
మంత్రిగానూ అయ్యన్నపాత్రుడికి విశేష అనుభవం ఉంది. ఇప్పటి వరకూ ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్న సొంతం. 1984 నుంచి 1986 మధ్యకాలంలో సాంకేతిక విద్యా మంత్రిగా పని చేశారు. ఆ కాలంలో స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.1994 నుంచి 1996 మధ్య రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పని చేశారు. మారుమూల గ్రామాల పరిధిలోని పంచాయతీరాజ్ రోడ్లను రహదారులు, భవనాల శాఖకు బదలాయించి అభివృద్ధి చేశారు.1999 అసెంబ్లీ ఎన్నికల గెలిచిన తరువాత అటవీశాఖ మంత్రి పదవిని చేపట్టారు. తన నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన అయ్యన్న చట్ట సభలో చివరి సారి సభాధ్యక్ష పదవి దక్కడం అదృష్టమన్నారు. సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానన్నారు.
శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు - SPEAKER AYYANNA PATRUDU