Aqua Farmers Problems: శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, గార, వజ్రపుకొత్తూరు, పోలాకిల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. సుమారు 2 వేల మంది సాగుదారులు, 10 వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో పది వేల మంది ఆక్వా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఈ రంగంపైనే ఎక్కువ మంది జీవిస్తున్నారు. పెరిగిన మేత, మందులు, లీజుల ఖర్చుతో రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు.
ఒడిదుడుకులు తట్టుకోలేక సాగుదారులు వందల ఎకరాలను ఖాళీగా వదిలేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకే ఇస్తామని చెప్పి నమ్మబలికారు. ఈ-ఫిష్ పేరుతో ఆక్వా సాగు చేసే ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఈ విధానంలో చెరువు లీజు ఒప్పందం, లైసెన్సు, విద్యుత్తు మీటర్, భూమి ఆన్‌లైన్ పత్రాలు ఇవ్వాలని గత ప్రభుత్వం మెలిక పెట్టింది. వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా యూనిట్ ధర 6 రూపాయలు చెల్లించాల్సిందేనంటూ నిబంధన విధించారు.
ఫలితంగా జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆక్వా జోన్ పరిధిలో లేకపోవడంతో రాయితీ వర్తించలేదు. దీంతో వందల మంది రైతులు లక్షల్లో అప్పులు చేసి రొయ్యల చెరువులను నిర్వహించి నష్టాల పాలయ్యారు. ధరలు పడిపోవడం, మేత రేటు పెరగడం, రొయ్యలకు తెల్ల మచ్చ వైరస్ సోకడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పెట్టిన పెట్టుబడి రాకపోగా చెరువుల నిర్వహణ కోసం మరింత అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, చేసేది లేక ఈ ఏడాది చెరువులను పూర్తిగా వదిలేశామని రైతులు చెబుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. ఇదే రంగంపై ఆధారపడిన వేలాదిమంది కూలీలు అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
మళ్లీ జిల్లాలో ఆక్వా రంగం పుంజుకోవాలంటే ఆక్వా రైతుకు యూనిట్ ధర రూపాయిన్నరకే విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినతరం చేసిన నిబంధనలన్నీ సులభతరం చేసి ఆక్వా రైతుకు సహకరిస్తే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ సాగించగలుగుతుందని ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.
"మేము లీజుకి మూడు ఎకరాల్లో చెరువులు వేశాము. ఈ విధంగా మూడు సంవత్సరాలకు లీజు తీసుకున్నాము. వైరస్ సోకిన కారణంగా ప్రతి రైతుకి 10 నుంచి 15 లక్షల రూపాయల నష్టం వచ్చింది. కరెంటు కూడా లేదు. డీజిల్‌ని ఉపయోగించడం వలన రోజుకి పది వేల రూపాయల ఖర్చు అయ్యేది. దీంతో ఇక సాగును ఆపేశాము. ప్రస్తుతం వేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు". - సత్యనారాయణ, ఆక్వా రైతు
నాసిరకంగా టైగర్ రొయ్య సీడ్- నిండా మునుగుతున్న ఆక్వా రైతులు - Aqua Farmers Facing Problems