APSRTC Launches Electric Bus Service : ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఐదు సంవత్సరాలల్లో డీజిల్ బస్సుల అన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకోవడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్ వాహనాల విధానం 2024-2029కి అనుగుణంగా 2029 నాటికి సంస్థలో అన్నీ విద్యుత్ బస్సులే నడపాలని భావిస్తున్నారు. అప్పటికల్లా ఏపీఎస్‌ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దెవి 2,562 కలిపి మొత్తం 12,717 బస్సులూ విద్యుత్‌వే ఉండాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Electric Buses in AP : ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు (స్క్రాప్)గా మార్చాలి. వచ్చే ఐదు సంవత్సరాలల్లో 2,537 బస్సులకు 15 సంవత్సరాలు దాటుతుంది. వీటినీ తుక్కుగా మార్చి, వాటి స్థానే విద్యుత్ బస్సులు తీసుకు రానున్నారు. 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సులు, 10 లక్షల కి.మీ. తిరిగిన అల్ట్రా డీలక్స్‌లు, సూపర్ లగ్జరీ, 8 లక్షల కి.మీ. నడిచిన ఎక్స్‌ప్రెస్‌లు, 6.5 లక్షల కి.మీ. ప్రయాణించిన తిరుమల ఘాట్ (Saptagiri Express) సర్వీసులు, 8 లక్షల కి.మీ. పూర్తి అయిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 లక్షల కి.మీ. దాటిన పల్లె వెలుగు, 13 లక్షల కి.మీ. తిరిగిన సిటీ ఆర్డినరీ బస్సులను పక్కన పెట్టాలి. వచ్చే ఐదు సంవత్సరాలల్లో ఇలాంటివి 5,731 బస్సులను పక్కన పెట్టనున్నారు. 2029లో తీసుకోబోయే 1,285 అద్దె బస్సులు, 2025-29 వరకు కొత్తగా పెంచబోయే 1,698 బస్సులు, 2029లో అదనంగా చేర్చబోయే 2,726 కూడా విద్యుత్ బస్సులే తీసుకుంటారు.
Electric Bus: కడప-తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు.. ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్
ఆర్టీసీకి భారం కాదా? : అన్నీ విద్యుత్ బస్సులే తీసుకుంటే ఏపీఎస్‌ఆర్టీసీకి గిట్టుబాటు అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే ఇందులో అద్దె ప్రాతిపదికన ఎన్ని? సొంతంగా కొనేవి ఎన్ని అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఒక్కో విద్యుత్ బస్సును రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల ధర పెట్టి కొనడం ఆర్టీసీకి భారమే అవుతుందని సమాచారం. అయితే గతం కంటే విద్యుత్ బస్సుల ధర తగ్గుతోందని, ముందు ముందు మరింత తగ్గవచ్చని అధికారులు అంటున్నారు.
తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులు : ఏపీలో 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం (Prime Minister EBus Service Scheme) కింద 750 విద్యుత్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరు అయ్యాయి. వీటిలో విశాఖపట్నం,విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరంలకు 50 చొప్పున మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి వ్యవహారాలశాఖ వీటికి టెండర్లు పిలిచి, బస్ కంపెనీలను ఎంపిక చేసి, వాటికి కి.మీ.కు ఎంత ధర చొప్పున చెల్లించాలో నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద పుణ్య క్షేత్రమైన తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులను మంజూరు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు.
దేవాలయాల్లో తొలిసారిగా విద్యుత్ బస్సును ప్రారంభించిన సింహాచలం దేవస్థానం - Simhachalam Devasthanam