APPSC Violating Rules: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల పాలిట శాపంలా మారింది. వైసీపీ దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి, ఉద్యోగార్థుల ఆశలను వమ్ము చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, నియామకాల ప్రక్రియను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అభ్యర్థులు నెత్తీనోరూ కొట్టుకున్నా, తమను ఎవరేం చేస్తారన్న ధోరణిలో కమిషన్ మొండిగా వ్యవహరించింది. తమను సంప్రదించేందుకు వచ్చిన అభ్యర్థులపైనా విరుచుకుపడింది. ఫలితంగా 2020 డిసెంబరులో నిర్వహించిన ప్రధాన పరీక్షలను రానున్న మూడు నెలల్లోగా మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. 10 వేల మంది వరకు ఈ పరీక్షలు రాయనున్నారు.
హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్-1 అధికారులుగా ఉన్న 143 మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 162 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018 డిసెంబరు 31న నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్నారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఉదయ్‌భాస్కర్ పాత్ర నామమాత్రమైంది. కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు గ్రూప్-1 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూశారు. డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్‌గా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాలు వెలువడి, తదుపరి చర్యలు తీసుకునే సమయంలో కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నియమితులయ్యారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
అభ్యర్థులు ప్రాధేయపడినా: గ్రూప్-1 పరీక్షకు లక్షా 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2019 మే 27న 59 వేల 200 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అదే ఏడాది జూన్‌లో ఫలితాలు విడుదల చేశారు. నిర్దేశిత నిష్పత్తి ప్రకారం వీరిలో 9 వేల 678 మందిని ప్రధాన పరీక్షలు రాసేందుకు అనుమతించారు. ఆ ఫలితాలను 2021 ఏప్రిల్ 28న వెల్లడించారు. తొలుత డిజిటల్ విధానంలో ఈ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, 326 మందిని మౌఖిక పరీక్షలకు ఎంపిక చేశారు. జవాబుపత్రాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడంతో అభ్యర్థులు నష్టపోయారని, మాన్యువల్ విధానంలోనే దిద్దాలని అభ్యర్థులు ప్రాధేయపడినా కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఒకదశలో డిజిటల్ మూల్యాంకనం బాగా జరిగిందని కొంతమంది అభ్యర్థులతో ప్రభుత్వానికి మద్దతుగా సైతం మాట్లాడించారు. అప్పుడే అభ్యర్థుల వేడుకోళ్లను కమిషన్ పరిగణనలోకి తీసుకుని ఉంటే సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మాన్యువల్ విధానంలో మాత్రమే ప్రధాన పరీక్షల జవాబుపత్రాలు దిద్దాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సమస్య మరింత జటిలమైంది. కొవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. విచారణ అనంతరం హైకోర్టు మాన్యువల్ విధానంలో ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలను దిద్దాలని ఆదేశించింది.
వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు
ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు: హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా రెండు సార్లు మాన్యువల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ విధానంలో మౌఖిక పరీక్షల కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో చాలామంది పేర్లు మాన్యువల్ మూల్యాంకన ఫలితాల్లో లేవని వాపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా 2021 నవంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య రెండుసార్లు మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారంటూ అభ్యర్థులు ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మొదటిసారి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రెండున్నర కోట్లు ఖర్చుపెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన కార్యదర్శిగా నియమితులైన అహ్మద్‌బాబు తొలివిడత మూల్యాంకన ఫలితాలను పక్కనబెట్టి, మార్చి 25వ తేదీన మరోసారి మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. ఏపీపీఎస్సీ మాత్రం మాన్యువల్ విధానంలో మూల్యాంకనం 2022 మార్చి 25 నుంచి మే మధ్య మాత్రమే నిర్వహించినట్లు హైకోర్టుకు తెలిపింది. చేతితో ఒకసారి మాత్రమే జవాబుపత్రాలను దిద్దించినట్లు పేర్కొంది.
నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత
మూల్యాంకనం తీరుపై అనుమానాలు: డిజిటల్ ఆన్‌లైన్ మూల్యాంకనం ద్వారా ప్రకటించిన తొలి జాబితాలో కంటే మలి జాబితాలో అభ్యర్థుల ఎంపికలో 10 నుంచి 20శాతం మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. అయితే సుమారు 38 శాతం అభ్యర్థులు మాత్రమే మౌఖిక పరీక్షలకు ఎంపికయ్యారు. 62 శాతం మంది అనర్హులయ్యారు. మొదటి విడతలో ఎంపికైన 326 మందిలో మలివిడతలో కేవలం 124 మంది మాత్రమే ఎంపికయ్యారు. 202 మంది పేర్లు గల్లంతయ్యాయి. దీంతో మూల్యాంకనం తీరుపై అనుమానాలు మరింత పెరిగాయి.
సహజంగా జవాబుపత్రాలను వేర్వేరు ప్రొఫెసర్లు రెండుసార్లు దిద్దుతారు. మార్కుల్లో వ్యత్యాసం 16 శాతం కంటే ఎక్కువగా ఉంటే మూడోసారి మరో ప్రొఫెసర్ ద్వారా దిద్దిస్తారు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్‌లోనూ మార్పు లేదు. ప్రతి ప్రశ్నకు సంబంధించిన జవాబుకు ఏపీపీఎస్సీ కీ ఇస్తుంది. దీని ప్రకారం ఆయా సబ్జెక్టుల నిపుణులు మూల్యాంకనం చేస్తే మొదటిసారి ఎంపికైన వారిలో ఎక్కువ మంది మలివిడత జాబితాలో ఎందుకు కనిపించలేదన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. తొలి విడత ఫలితాల్లో 42 శాతం మంది తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఎంపికయ్యారు. రెండో విధానంలో 8 శాతానికే పరిమితమయ్యారు.
ఆరు నెలల్లో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ - మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదన్న హైకోర్టు
ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించడం లేదు: కమిషన్ తరఫున జరిగే నియామకాల్లో గ్రూప్-1 ఉద్యోగాలే పెద్దవి. ఇలాంటి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం మౌఖిక పరీక్షలను రద్దు చేస్తున్నామని ఘనంగా ప్రకటించిన కొద్దిరోజులకే వైసీపీ ప్రభుత్వం మనసు మార్చుకుంది. వైసీపీలో పనిచేసి, సీఎం జగన్ ప్రాపకంతో కమిషన్‌లో సభ్యులైనవారే మౌఖిక పరీక్షలను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించడం లేదు.
పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న కమిషన్, అభ్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో కఠిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులను ఆందోళనలోకి నెట్టేసింది. మరోవైపు ఈ నెల 17వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. వీరిలో కొందరు 2018 నోటిఫికేషన్ నాటి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావాల్సినవారూ ఉంటారు. వారు ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ రాయాలా, గత పరీక్ష నాటి మెయిన్స్ మళ్లీ రాయాలా అర్థంకాక తలపట్టుకుంటున్నారు.
ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్