జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల - YS SHARMILA COMMENTS
ఒక్క ఒప్పందంలో జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం ముట్టిందన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల - ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్న
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2024, 12:23 PM IST
|Updated : Nov 22, 2024, 12:53 PM IST
APCC President YS Sharmila Comments: గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ జగన్‌కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని షర్మిల తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ, మరికొందరిపై అభియోగాలు చేశాయని అన్నారు. గౌతమ్ అదానీ భారత్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని, కొన్ని రాష్ట్రాలకు చెందిన సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. రూ.2,100 కోట్లు లంచాలు ఇచ్చినట్లు వెల్లడించారని, అందులో ఏపీ ఉన్నతాధికారికి రూ.1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారని షర్మిల తెలిపారు. ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్లు అమెరికా ఏజెన్సీలు వెల్లడించాయన్నారు.
గౌతమ్ అదానీపై విచారణ చేస్తే ఈ విషయం వెల్లడైందని, రూ.1,750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. అమెరికా ఏజెన్సీలు బయటపెట్టే వరకు విషయం తెలియలేదన్న షర్మిల, గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని మండిపడ్డారు. ఒక్క ఒప్పందంలో జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం ముట్టిందని, రాష్ట్ర ప్రజలపై రూ.17,500 కోట్ల భారం పడిందని స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం కాదా?: ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం కాదా అని షర్మిల ప్రశ్నించారు. 20 ఏళ్ల ఒప్పందంతో రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్లు భారం పడుతుందని, ఇతర రాష్ట్రాలకు రూ.1.99కే ఇస్తుంటే ఏపీలో ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఇదొక్కటే కాదని అదానీతో చాలా ఒప్పందాలు చేసుకున్నారని వెల్లడించారు. అదానీతో ఒప్పందాల్లో ఎంత లంచం వచ్చి ఉండాలని ప్రశ్నించిన షర్మిల, కృష్ణపట్నం పోర్టు, డేటా సెంటర్‌కు భూములు కట్టబెట్టారని అన్నారు.
పవర్ ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దు చేయాలి: బీచ్ శాండ్ మైనింగ్, సబ్ మెరైన్‌లో ఎంత లంచం వచ్చి ఉంటుందని నిలదీశారు. అదానీతో పవర్ ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అదానీతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలపై సమీక్షించాలని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించాలని కోరారు. గౌతమ్ అదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, పవర్ ఒప్పందాలు రద్దు చేయాలనేది కాంగ్రెస్ డిమాండ్ అని వెల్లడించారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు.
జగన్- అదానీల స్కామ్లో మీకు ఇవి తెలుసా?
వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే