AP NEW SPORTS POLICY FEATURES : కొత్త క్రీడా విధానం క్రీడాకారులు, సంఘాల్లోనూ కొత్త ఊపిరిలూదింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై పట్టం కట్టనుంది. భారీ నజరానాలతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రీడాకారుల వెన్నంటి ఉండి వారిని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది.
ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు ఏర్పాటు: ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రీడా విధానం ద్వారా ప్రతి గ్రామంలోనూ మైదానం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయనుంది. అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడా నగరం స్థాపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏపీని గమ్యస్థానంగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో జాతీయస్థాయి అత్యుత్తమ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేనుంది. అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు ఏర్పాటు చేయనునున్నారు.
క్రీడా రాజధానిగా ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన సూచనలపై అధికారులు మార్పులు, చేర్పులు చేసి కొత్త క్రీడా విధానం-2024-29ను సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. క్రీడారంగాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి వారిలో నూతనోత్సాహాన్ని నింపేలా కూటమి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లకు కొత్త క్రీడా విధానం రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి దేశంలోనే ఇప్పటివరకు హరియాణా అత్యధికంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
క్రీడల్లో మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే అకాడమీలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2029 నాటికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా, క్రీడల్లో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రీడా విధానంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఒలింపిక్స్‌లో బంగారు విజేతలకు రూ.7 కోట్లు - ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు
మరే రాష్ట్రంలోనూ లేనంత భారీ నజరానాలు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత భారీ నజరానాలు అందించడం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రోత్సహించడం కొత్త క్రీడావిధానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి బంగారు పతకమైతే 7 కోట్లు, వెండి పతకమైతే 5 కోట్లు, కనిష్టంగా కాంస్యమైతే 3 కోట్లు అందించనున్నారు. పోటీల్లో పాల్గొన్నవారికి 15 లక్షలు ఇకపై ఇవ్వనున్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధిస్తే గరిష్టంగా 4 కోట్లు, వెండి పతకం సాధించినవారికి 2 కోట్లు, కాంస్యమైతే కోటి బహుమానంగా ఇవ్వనున్నారు.
పోటీల్లో పాల్గొన్నవారికి ఇకపై 10 లక్షలు అందించనున్నారు. నాలుగేళ్లకోసారి నిర్వ హించే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధిస్తే గరిష్ఠంగా 50 లక్షలు, కనిష్ఠంగా 25 లక్షలు. పోటీల్లో పాల్గొంటే 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. భారత ఒలింపిక్ అసోసియేషన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, కామన్ వెల్త్ క్రీడా సమాఖ్య ఇలా ప్రఖ్యాత క్రీడాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పతకాలు సాధిస్తే ప్రభుత్వశాఖల్లో గ్రూప్- 1, 2, 3 స్థాయి ఉద్యోగాలు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉద్యోగ నియామకాల్లో ఇప్పటివరకు ఉన్న 2 శాతం రిజర్వేషన్ను 3 శాతానికి పెంపుదల చేశారు.
రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారుల తయారీకి అత్యాధునిక శిక్షణ అందించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా అంతర్జాతీయ, జాతీయ క్రీడాపోటీలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి క్రీడాసంఘాల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అందరికీ ఆటలు నిర్వహించడంతోపాటు ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచి వారి జీవనశైలిలో మార్పు తీసుకురావడం కూడా క్రీడా పాలసీలో భాగంగా అమలు చేయనున్నారు.
యువతను నైపుణ్య శిక్షణ ద్వారా తీర్చిదిద్దాలి : సీఎం చంద్రబాబు - CM Review on Employement and Sports