AP NEW CABINET MINISTERS: వారం రోజుల్లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు? ఇప్పుడు ఇవే అంశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీపరంగా కీలక బాధ్యతలు చూసుకుంటారా అనే దానిపైనా చర్చ జరుగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో, ఈసారి ఎలాంటి మొహమాటాలకూ పోకుండా క్లీన్’ఇమేజ్ ఉన్న నేతలవైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా.
నేతల మధ్య తీవ్ర పోటీ : కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యం కావటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికలోనూ గతంలోకన్నా ఈసారి అధిక సంఖ్యలోనే మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. కడపలో మాధవీరెడ్డి, పుట్టపర్తిలో సింధూరరెడ్డి, పెనుకొండలో సవిత వీరంతా రాయలసీమలో జిల్లాల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ వర్గాల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీ వర్గం నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీ వర్గాల నుంచి మాధవి, యనమల దివ్య, సవిత వంటి వారున్నారు.
వీరిలో ఒకరిద్దరికి మంత్రి వర్గంలో అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్తతరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారే. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కి పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన సౌమ్య, అనిత వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. విజయనగరం నుంచి గెలుపొందిన, పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోకగజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రానున్నట్లు సమాచారం.
ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం! - CHANDRABABU WILL TAKE OATH AS AP CM ON JUNE 12
లోకేశ్ మంత్రివర్గంలో ఉంటారా: టీడీపీలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి మురళీమోహన్, ఆర్.వి.ఎస్.కె. రంగారావు, కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్ధసారధి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, చిన తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
లోకేశ్ మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తారా, లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావు, విజయ్‌కుమార్, బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, రామనారాయణరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమరనాధ్‌రెడ్డితోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. అనంతపురం జిల్లా నుంచి కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి.
వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ప్రాధాన్యం లభించొచ్చు. మైనారిటీల నుంచి ఫరూక్, నసీర్, షాజహాన్ భాషా ముగ్గురు ఎన్నికయ్యారు. ఈవర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాలన్నింటిలోనూ ఎన్డీఏ అభ్యర్థుల ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్' - దిల్లీ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు - lok sabha Kingmaker Chandrababu 2024
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా? అన్న దానిపై ఇంకా పార్టీపరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లైతే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది. జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అగ్రవర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిథ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు. బీసీ వర్గాల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు.
బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కేలా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. 2014లో బీజేపీతో కలిసి మంత్రివర్గం ఏర్పాటుచేసినప్పుడు అప్పట్లో అయిదుగురు ఎమ్మెల్యేలకుగాను ఇద్దరికి అవకాశమిచ్చారు. ఈసారి ఎనిమిది మంది ఉన్నప్పటికీ గరిష్టంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. సీనియర్ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్ధసారధిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి.