AP NDA Leaders on YSRCP Govt Corruption: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారని, అందినకాడికి అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. 18 నెలలు జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి, మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధం అంటున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. విజయవాడలో ఎన్డీఏ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జగన్‌కు ఉన్న డబ్బు పిచ్చితో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎన్డీఏ నేతలు దుయ్యబట్టారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమీషన్లకు కక్కుర్తి పడి పనులు ఆపేశారని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు చూసేందుకు భయపడిపోతున్నారని అన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అవినీతిని వివరిస్తూ అంశాల వారీగా పుస్తక రూపంలో ప్రచురించామని చెప్పారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్, భూ మాఫియా ఇలా అన్నింటినీ వదలకుండా దోచుకున్నారని అన్నారు.
12 లక్షల కోట్లు రూపాయల రుణం తెచ్చానని చెబుతున్న జగన్, వాటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో 2.50 లక్షల కోట్ల రూపాయలకు బటన్ నొక్కానని చెబుతున్న జగన్, మిగతా తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని అమలు చేయకుండా మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు. 11 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి మూడు రెట్లు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పాలసీని మార్చి, మధ్యతరగతి వారికి ఇసుక అందకుండా చేశారన్నారు.
తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి: జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర సంపద దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని బొండా ఉమ అన్నారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్ అని, రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి దేనికైనా సిద్ధపడతారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి జతకట్టామని బొండా ఉమ తెలిపారు. జగన్ అవినీతిని సొంత కుటుంబమే బయట పెడుతోందని పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని, గాడితప్పిన పాలనను మళ్లీ దారిలో పెడతామని స్పష్టం చేశారు.
మద్యనిషేధం అని హామీ ఇచ్చిన జగన్, జే బ్రాండ్‌లు అమ్ముకుని కోట్లు కూడేసుకున్నారన్నారు. నాసిరకం మద్యం వల్ల లక్షల మంది రాష్ట్రంలో పేదలు చనిపోయారని తెలిపారు. డిస్టిలరీలు అన్నీ కూడా వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయనేది వాస్తవం కాదా అని నిలదీశారు. జగన్ మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన వీరమహిళ నాయకురాలు రాయపాటి అరుణ అన్నారు. 2019 లో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదని విమర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలకు వైద్యం అందడం లేదని ఆవేదన చెందారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న రజిని నియోజకవర్గంలోనే వైద్య సేవలు అందని దుస్థితిలో ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో మంత్రులు తమ శాఖల వృద్ధి, కార్యాచరణపై ఎప్పుడూ దృష్టి సారించలేదని అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు, చేసిన అవినీతి 8 లక్షల కోట్లుగా ఉన్నాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. జగన్ అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని, గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులకు తన స్టిక్కర్ వేసుకొని ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు.
అహంకారులకు ప్రజాస్వామ్యంలో చోటులేదు-జగన్,కేసీఆర్‌లపై బొండా ఉమ విసుర్లు - Bonda uma press meet