AP High Court On YCP Ex Minister Merugu Nagarjuna Petition : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. బాధితురాలు స్వయంగా హైకోర్టుకు హాజరై నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, ఆయనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదంటూ ప్రమాణపత్రం దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ స్పందిస్తూ ఫిర్యాదిదారు కోరగానే అత్యాచారం కేసును కొట్టేయలేమన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదిదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే పరిణామాలు : మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ప్రజాప్రతినిధులనే కారణంతో కేసులపై విచారణ మూసివేతకు ఆదేశించలేమన్నారు. మూసివేత విషయంలో పోలీసులు చట్ట నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి కేసులలో హైకోర్టుకు ఉన్న అసాధారణ విచారణ పరిధిని వినియోగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కోర్టుకొచ్చి నిందితులపై కేసును కొట్టేయాలని కోరడాన్ని ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నామన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వారు సైతం అందుకు పరిణామాలు ఎదుర్కోవాల్సిందేన్నారు.
దర్యాప్తుపై స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశం : ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు డైరీ, దర్యాప్తుపై స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. విచారణ ఈనెల 12కి వాయిదా వేశారు. మేరుగు నారార్జున తరఫు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ, తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకోవడమే కాకుండా శారీరకంగా వాడుకున్నారనే ఆరోపణతో వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జునపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని ప్రమాణపత్రం : తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మేరుగు నాగార్జున ఆయన పీఏ వి.మురళీమోహన్‌రెడ్డి ఈనెల 5న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ప్రస్తుతం హైకోర్టులో విచారణకు రాగా ఫిర్యాదిదారు, బాధిత మహిళ హైకోర్టుకు హాజరై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, పిటిషనర్లపై కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని ప్రమాణపత్రం దాఖలు చేశారు.
మాజీమంత్రి మేరుగు నాగార్జునపై రేప్ కేసు..
"ఆ ఉపాధ్యాయురాలికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాం- నీకూ అదే గతి పడుతుంది" - మాజీ మంత్రిపై మహిళ ఫిర్యాదు