AP High Court on Doli Woes in Tribal Areas: వైద్యం కోసం డోలీలలో మోసుకెళుతున్న ఫోటోలను పరిశీలిస్తే ఆదిమకాలం నాటి పరిస్థితులను తలపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వైద్యం అందక గిరిజనుల మృతిపై పత్రికల్లో కథనాలు చూస్తున్నామని పేర్కొంది. రహదారులను ఏర్పాటు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించలేమని తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యం, రోడ్డు సదుపాయాల కోసం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మారుమూల ప్రాంతాలకు రహదారి మార్గాలను ఏర్పాటు చేసే నిమిత్తం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద గిరిజన ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాల డీఎంహెచ్‌వోలు(District Medical and Health Officer), విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది.
రహదారులు లేక విద్య, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలు లేవు : గిరిపుత్రులు
విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది యెలిశెట్టి సోమరాజు పిల్ వేశారు.
చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించని కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై విచారణకు ఆదేశించాలని కోరారు. రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో గిరిజనులను డోలీలో మోసుకెళుతున్నట్లు పత్రికల్లో ప్రచురితం అయిన కథనాలను పిల్‌తో జత చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు.
అడవి బిడ్డల మరణ ఘోషను పట్టించుకోరా ?: చంద్రబాబు
రహదారులు లేకపోవడంతో గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారిని డోలీలలో కిలోమీటర్ల దూరం మోసుకెళుతున్నారని అన్నారు. సకాలంలో వైద్యం అందక పలువురు మృతి చెందుతున్నారని తెలిపారు. మృతదేహాలను తరలించేందుకు కనీసం అంబులెన్స్‌లను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై బంధువులు తరలించారని కోర్టుకు తెలిపారు. అంత్యంత దయనీయ స్థితిలో గిరిజనులు జీవనం సాగిస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం హక్కులను హరించడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రణతి అన్నారు.
గిరిజనులు ఎత్తైన కొండలపై జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అక్కడికి రోడ్డు మార్గాలు లేవని పేర్కొన్నారు. కొండకు దిగువన అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు.
భార్య మృతదేహం బైక్‌పై తరలింపు - జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం : నారా లోకేశ్