Mini Gokulam Scheme in AP : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అన్ని రంగాలతో పాటు పాడిపరిశ్రమ కూడా దెబ్బతింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన మినీ గోకులాలను జగన్ సర్కార్ నుంచి సరైన ప్రోత్సాహం లేక పశుపోషకులు, జీవాల పెంపకందారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అన్నదాతల సమస్యలతో పాటు పశుపోషకులు, కోళ్ల రైతుల కష్టాలను తీర్చేందుకు మినీ గోకులాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. మండలానికి 25 యూనిట్ల చొప్పున ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1775 మినీ గోకులాలను మంజూరు చేసింది. పల్నాడు జిల్లాకు 700, బాపట్ల జిల్లాకు 625, గుంటూరు జిల్లాకు 450 మినీ గోకులాలు కేటాయించారు.
AP Govt Focus on Dairy Industry : ఉపాధి హామీ పథకం నిధులతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1775 మినీ గోకులాలు ఏర్పాటు చేయనున్నారు. 90 శాతం ఉపాధి హామీ పథకం నిధులు, 10 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. మండలానికి 25 మినీ గోకులాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు ఆవుల గోకులం యూనిట్ ధర రూ.1.15 లక్షలు కాగా సబ్సిడీపై రూ.11,500లు చెల్లించి నిర్మించుకోవచ్చు.
Mini Gokulam in Joint Guntur District : నాలుగు ఆవుల గోకుల నిర్మాణానికి రూ.1.85 లక్షలు కాగా సబ్సిడీపై రూ.18,500లకు ఇస్తామని అధికారులు తెలిపారు. ఆరు ఆవుల గోకుల నిర్మాణానికి రూ.2.30 లక్షలు అవుతుండగా సబ్సిడీపై రూ.23,000లతో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ఇక 20 మేకలు లేక గొర్రెలున్న యూనిట్ ధర రూ.1.30 లక్షలు కాగా సబ్సిడీపై రూ.39,000లకు, 50 పశువులున్న యూనిట్ ధర రూ.2.30 లక్షలయితే సబ్సిడీపై రూ.69,000లతో గోకులం నిర్మించుకోవచ్చని అధికారులు వివరించారు.
"మొత్తం సబ్సీడి వచ్చింది. 18 వేలు కట్టాం. మిగతా డబ్బులు రాలేదు. పాడిపరిశ్రమ చాలా బాగుంది. గోకులాల ఏర్పాటు అనేది చాలా మంచిది. ఈ మినీ గోకులాల వల్ల వ్యవసాయంలో నష్టం వచ్చినా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది." - శ్రీనివాసరావు, పశుపోషకులు, పేరేచర్ల
నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు : ఆరు ఆవులు లేదా గేదెలు ఉండే మినీ గోకులాన్ని 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు కొలతలతో రేకుల షెడ్ నిర్మించాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన ప్రణాళిక, నిబంధనలు అనుగుణంగా నీటి తొట్టిని నిర్మించుకోవాలి. మినీ గోకులంలో నాలుగు లైట్లు, రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్‌లను సైతం ఇదే తరహాలో ఏర్పాటు చేసుకోవాలి.
గోకులాల లబ్ధిదారుల హర్షం : ఈ షెడ్‌ల నిర్మాణానికి 70 శాతం ఉపాధి హామీ పథకం నిధులు, 30 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లించాలి. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుతో పాటు సొంత స్థలం కలిగి ఉన్న రైతులు ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మినీ గోకులాల వల్ల వ్యవసాయంలో నష్టం వచ్చిన నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.