AP Full Budget 2024 : ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక ఏడాది ప్రారంభానికి ముందే గత వైఎస్సార్సీపీ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. తొలి 4 నెలల కాలానికి ఆ పద్దు ఆమోదించగా ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా పెట్టలేదు.
AP Govt Exercise on Budget 2024 : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లోటుపాట్లు మొత్తం క్రోడీకరించేందుకే ఎక్కువ సమయం తీసుకోవడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి మరో 4 నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది. అయితే నవంబర్ నెలాఖరులోపు మాత్రం పూర్తిస్థాయి పద్దు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఆర్థికశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు : బడ్జెట్ తయారీ కోసం ప్రభుత్వశాఖల నుంచి ఇప్పటికే ప్రాథమికస్థాయిలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. పూర్తిస్థాయి పద్దు తయారీకి విధివిధానాలు, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవసరమైన సమాచారంపై చర్చించేందుకు ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ప్రస్తుతం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో దాదాపు 19 ప్రభుత్వ శాఖలతో చర్చించారు.
నేడు కీలకమైన జలవనరులు, రహదారులు, పంచాయతీరాజ్‌శాఖలతో సమీక్షించనున్నారు. ఇక్కడ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులతోనూ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
ఆర్థికశాఖ పాత్ర నామమాత్రంగా : అయితే జగన్ ప్రభుత్వంలో బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ అధికారుల పాత్ర నామమాత్రంగా మిగిలిపోయింది. కన్సల్టెన్సీల సాయంతోనే పద్దు ప్రతిపాదనలు కొలిక్కి తీసుకువచ్చేవారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎక్కడో బయట కూర్చొని చివర్లో గణాంకాలకు తుదిరూపు ఇచ్చేవారు.
'బడ్జెట్లో రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు కేటాయించనట్లు కాదు' - FINANCE MINISTER SPEECH ON BUDGET