AP FiberNet Scam Updates : జగన్ అండతో ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ హోదాలో మధుసూదన్‌రెడ్డి సొంత జాగీరులా సంస్థ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టారు. సంస్థ అవసరానికి మించి నియామకాలు చేయడమే కాకుండా, బంధువులకు కీలక పోస్టులు, కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు, సంస్థ పేరిట తెచ్చిన అప్పును లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
EX MD Madhusudhan Reddy Scams in FiberNet : ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫైబర్‌నెట్‌లో జరిగిన ఆక్రమాలకు ఆధారాలు దొరకకుండా చేసేందుకు కొందరు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సర్కార్ గత నెల 4నుంచి విజయవాడలోని ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబ్బంది ఆన్‌లైన్ విధానంలో పనిచేసేలా నిర్ణయం తీసుకుంది.
అంతా ముందస్తు వ్యూహమే : ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ ఫైబర్‌నెట్ రూ.900 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ మొత్తం సంస్థ ఖాతాలో జమ కాగానే ఎడా పెడా చెల్లింపులు జరిగాయి. ఇందులో రూ.151 కోట్ల చెల్లింపులకు లెక్కాపత్రం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైబర్‌నెట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ఇటీవల ఉన్నతాధికారులు పరిశీలించారు. కొన్ని చెల్లింపులకు ఎలాంటి వివరాలు లేవు. అయితే బ్యాంకు ఖాతాల సమాచారం ఆధారంగా లెక్క తేల్చడం అధికారులకు సాధ్యం పడడం లేదు.
నిశితంగా పరిశీలించాలని భావిస్తున్న అధికారులు : మధుసూదన్‌రెడ్డి వాటి దస్త్రాలు ఆన్‌లైన్‌లో లేకుండా చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ-ఆఫీసు విధానాన్ని తొలగించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీన్నిబట్టి ముందస్తు వ్యూహంతోనే ఆన్‌లైన్‌లో రికార్డులు దొరక్కుండా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ప్రధాన కార్యాలయం తెరిచాకే, బ్యాంకు ద్వారా చెల్లించిన వందల కోట్లకు ఏ దస్త్రాలు ఉన్నాయి? అందులో ఉన్న లెక్కలేంటి? ఎక్కడి నుంచి ఎంత డబ్బు వచ్చింది? ఆ మొత్తాన్ని ఎవరెవరికి చెల్లించారు? వారికి వాస్తవంగా చెల్లించాల్సిన అవసరం ఉందా? వంటి అంశాలు తేలే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గతంలో ఫైబర్‌నెట్ పాలన వ్యవహారాలు ఇంధనశాఖ పర్యవేక్షణలో ఉండేవి. మధుసూదన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ పరిధిలోకి మార్చాలని పట్టుపట్టారు. దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసు చేశారు. అప్పటికప్పుడు శాఖ మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాతే సంస్థ పేరిట రుణాన్ని తీసుకోవడం, ఆ మొత్తంలో మెజారిటీ వాటాను క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల నిర్వహణ కాంట్రాక్టర్‌కు చెల్లించడం చకచకా జరిగింది. ఈ వ్యవహారంలో 15 శాతం కమీషన్ వసూలుచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సిబ్బంది నియామకాల్లో అడ్డగోలుగా వ్యవహరించిన మాజీ ఎండీ : సిబ్బంది నియామకాల్లో మాజీ ఎండీ అడ్డగోలుగా వ్యవహరించడంపై ఇప్పటికే అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని క్యాడర్లలో కలిపి 1,299 మంది సిబ్బంది ఉన్నట్లు నిర్ధారించారు. ఇద్దరు మినహా మిగతా వారంతా నాయకుల సిఫారసులతో ఉద్యోగాలు పొందిన వారే. ఫీల్డ్ సిబ్బంది విధులకు రాకున్నా, ప్రతి నెలా జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. బినామీ పేర్లనూ జాబితాలో చేర్చి వారికి ప్రతి నెలా చెల్లించే మొత్తాన్ని సంస్థ ఎండీ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టి ఏటా రూ.12 కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వైఎస్సార్సీపీ అక్రమాలకు నిలయంగా ఫైబర్‌నెట్ - త్వరలో విచారణ కమిటీ - AP State Fibernet Ltd