AP CEO Mukesh Kumar Meena Media Conference: రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని ఆయన అన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేయాలని కేంద్ర పరిశీలకులు సిఫార్సు చేశారన్న సీఈవో ఆ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లిలో పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేయాలని మీనా తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్న సీఈవో మీనా ప్రస్తుతానికి 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని సీజ్‌లకు సంబంధించి 9 వేలు కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
గుంటూరులో 'లెట్స్ ఓట్'3కె- 82శాతానికి పైగా ఓటింగ్ లక్ష్యం : సీఈవో ముఖేష్ - vote awareness program
సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు వచ్చాయన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 10,403 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందారని 156 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 203 కోట్ల సొత్తు సీజ్ చేయగా అందులో రూ.105 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 47 కోట్ల నగదు, రూ.28 కోట్ల విలువైన మద్యం, రూ.3.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ.382 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పింఛన్ల సొమ్ము పంపిణీపై సమసిపోయిన అంశమని సీఈవో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గోవా మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఎన్నికల సమయంలో అలర్లు, రీపోలింగ్ జరగకుండా చర్యలు: ముఖేష్ కుమార్ మీనా
రాష్ట్రంలో 454 మంది ఎంపీ, 2300 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల వివరాలు డీజీపీ, ఏడీజీపీ, ఇంటెలిజెన్స్‌కు పంపించామన్నారు. నివేదిక మేరకు ముప్పు ఉన్న 374 మంది ఎమ్మెల్యే, 64 మంది ఎంపీ అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని మీనా వివరించారు. జనసేన పోటీచేసే ఎంపీ పరిధి అసెంబ్లీ స్థానాల్లో గ్లాసు గుర్తు ఇతరులకు ఇవ్వలేదని సీఈవో పేర్కొన్నారు. ఇప్పటికే కేటాయించిన 7 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గుర్తు మార్చామని సీఈవో మీనా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్‌కు 28 వేల మంది సమ్మతించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పెరిగినందున అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరమని మీనా తెలిపారు.