Difficulties of Voters to Vote In AP Assembly Elections : ఓటు వేయడమంటే పండగ కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. అసలే మండుటెండలు, ఆపై తీవ్రమైన ఉక్కపోత, గొంతెండిపోతున్నా సరే అందుబాటులో తాగునీరు లభించని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందుల మధ్య ఒక్కొక్కరు నాలుగు నుంచి ఆరున్నర గంటల పాటు క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తే ఏ ఓటరైనా ఆహ్లాదంగా ఓటు వేయగలరా?
Election Commission Failed to Conduct Elections : ‘ఓటు హక్కు వినియోగించుకోండి బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలవండి’ అంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ఎన్నికల సంఘం 5,600 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో చోట 1,200కు పైగా ఓటర్లను కేటాయించింది. కొన్ని చోట్ల 1300, 1400 మందికి పైగానూ ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌కు నిర్దేశించిన సమయమెంత? ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వారు ఇబ్బంది పడకుండా ఓట్లు వేయడం సాధ్యమవుతుందా? 400-500 మంది ఓటర్లకు ఒక బూత్‌ను ఏర్పాటు చేయలేమా? వంటి ప్రశ్నలు సగటు ఓటరు నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఎన్నికలోనూ ఓటర్లకు ఇవే కష్టాలు పునరావృతమవుతున్నా ఎన్నికల సంఘం పాఠాలు నేర్వడం లేదు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ - 80 శాతానికి చేరువలో ఓటింగ్ - Voters Crowd at Polling Centers
ఇది ఎన్నికల సంఘం మాట: ఒక వ్యక్తి లోక్‌సభ, శాసనసభకు సంబంధించి రెండు ఓట్లు వేయడానికి సగటున 27 నుంచి 30 సెకన్ల సమయం పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గంటకు సగటున 120 మంది వరకూ ఓటు వేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఒక్కో ఈవీఎం గంటకు 120కు పైగా ఓట్లును తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుందనేది వారి మాట. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు.
ఒక్కో వ్యక్తి ఓటు వేయటానికి తక్కువలో తక్కువగా కనీసం రెండు నిమిషాల సమయం పడుతోంది. లోక్‌సభ, శాసనసభకు ఒకే సారి ఎన్నిక జరిగినందున ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేయాలి.
ఉదయం 7 గంటల నుంచి నుంచి సాయంత్రం 6 వరకూ మొత్తంగా 11 గంటల పాటు ఎన్నికల సంఘం పోలింగ్‌కు సమయమిస్తోంది ఈ 11 గంటల వ్యవధిలో 1000-1200 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం. ఇక ఈవీఎంల మొరాయింపు, ఇతర సాంకేతిక సమస్యలు ఏవైనా తలెత్తితే ఇంకా జాప్యం జరిగి మరింతగా ఇబ్బందులొస్తాయి. కానీ ఇవేవి పరిగణనలోకి తీసుకోని ఎన్నికల సంఘం మాత్రం చాలా చోట్ల ఒక్కో పోలింగ్ కేంద్రంలో అధికంగా ఓటర్లను చేర్చింది. ఇదే ఓటర్లకు నరకయాతనగా మారింది.
ఓటు వేసేందుకు ఆరున్నర గంటల నిరీక్షణ : ఉదాహరణకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని 205వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,369 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవటానికి దాదాపు ఆరు గంటల పాటు క్యూలైన్లో నిలుచోవాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గంలోని గుడ్‌న్యూస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలోని 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,467 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఒక్కో ఓటరు నాలుగున్నర గంటల పాటు క్యూలైన్లో నిలబడాల్సి వచ్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 254వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,087 ఓట్లున్నాయి. ఇక్కడ ఒక్కో ఓటరు మూడు గంటల పాటు క్యూలైన్లో నిరీక్షించాల్సి వచ్చింది.
ఒక వైపు మండుటెండ, మరోవైపు నీళ్లు తాగుదామంటే క్యూలైన్ల పక్కన ఉండవు. దూరంగా ఎక్కడో పెట్టారు. అక్కడికి వెళ్లి తాగుదామంటే ఈ క్యూలైన్లో తన క్రమం తప్పిపోతే మళ్లీ మొదటి నుంచి నిలుచోవాల్సి వస్తుందనే ఆందోళన. బీపీ, షుగర్ పేషెంట్లు అన్ని గంటల పాటు క్యూలైన్లో నిలుచోలేక పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలా చోట్ల ఇరుకుగా ఉండే ఒకే భవన సముదాయం ప్రాంగణంలోని ఒక్కో గదిని ఒక్కో పోలింగ్ కేంద్రంగా మార్చేశారు. ఆ క్యూలైన్లు, ఈ క్యూలైన్లు కలిసిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం వృద్ధులు కూర్చోటానికి చైర్లు కూడా లేని పరిస్థితి.
అర్ధరాత్రి, తెల్లవారుజాము పోలింగా? : సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిన పోలింగ్‌ను అర్ధరాత్రి దాటేంతవరకూ, మరుసటి రోజు తెల్లవారు జామువరకూ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? అంటే ఒక పోలింగ్ కేంద్రంలో నిర్దేశిత సమయంలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోగలరో అంతకు మూడు, నాలుగు రెట్లు అధికంగా ఓటర్లను చేర్చటం వల్లే ఈ పరిస్థితి. వందశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. సుమారు 81 శాతం పోలింగ్ జరిగితేనే అర్ధరాత్రి వరకూ, మరుసటి రోజు ఉదయం వరకూ పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటే ఇక వారి వంద శాతం పోలింగ్ జరిగితే ఎన్నిక ప్రక్రియ పూర్తవ్వాలంటే ఎంత సమయం పడుతుందో?
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500కు మించితే ఇబ్బందే : సగటున ప్రతి 400-500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగితే ఓటర్లకు ఇబ్బందులు తప్పుతాయి. వారు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోగలరు. ఇబ్బందులు తప్పుతాయి. అర్ధరాత్రి వరకూ, మరుసటి రోజూ వరకూ పోలింగ్ కొనసాగించాల్సిన అవసరమూ తలెత్తదు.
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలకు కొరతే లేదు. ఊరూరా అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల భవనాలు, సామాజిక భవనాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. విధులు నిర్వర్తించేందుకూ కావాల్సినంత మంది ప్రభుత్వోద్యోగులు సిద్ధంగానే ఉన్నారు. ఆ మేరకు అవసరమైన ఈవీఎంలు సమకూర్చుకుంటే చాలు.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024