104 Ambulance Employees Protest in AP : గత ప్రభుత్వంలో అరబిందో సంస్థ తమకు సరిగా జీతాలు చెల్లించలేదని, మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు లేవంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలోని పలు జిల్లాల్లో 104 వాహన సిబ్బంది ధర్నా చేపట్టారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్యాయం జరుగుతోంది : వేతనాలు చెల్లించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జీవో నంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 104ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఒకటో తారీకునే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఉద్యోగులు అందోళన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించండి : 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. 15 ఏళ్లుగా 104 లో విధులు నిర్వహిస్తున్న కనీసం వేతనాలు సకాలంలో చెల్లించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలకు కాకుండా ప్రభుత్వమే 104 ఉద్యోగుల నిర్వహణ చూడాలని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించాలి : అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట 104 వాహన సిబ్బంది ఆందోళన చేశారు. బకాయి వేతనాలు చెల్లించాలని, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని, పీహెచ్‌సీలను విలీనం చేయాలని, జీతాలు పెంచాలనే డిమాండ్లతో నిరసన తెలిపారు. నిరంతరాయంగా రోగులకు వైద్య సేవలు అందిస్తూ అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్ చేయాలంటూ నిరసన తెలిపారు.
108, 104 సర్వీసులు నుంచి అరబిందో ఔట్!
104 Employees: "మాకు జీతాలు చెల్లించండి మహాప్రభో".. 104 ఉద్యోగులు ఆవేదన