Animal Warrior Organisation in Prakasam district: ఆ యువకులకు సముద్రమన్నా, అందులో జీవిస్తున్న జీవ రాశులన్నా అపారమైన ప్రేమ. అందుకే సముద్రాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న జీవరాశులు వాటి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు యువకులు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీర ప్రాంతంలో యానిమల్ వారియర్స్ సంస్థలో సంజీవ్ వర్మ, రామకృష్ణ, అమర్‌నాథ్ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.
యానిమల్ వారియర్స్ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, రామకృష్ణ, అమర్‌నాథ్ అనే యువకులు తీర ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోసం పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రాణాపాయస్థితిలో ఉన్న మూగజీవులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించటం చేస్తుంటారు. అంతేకాకుండా సముద్ర కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. సముద్ర గర్భంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవరాశులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు.
మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు వారి వలలు సముద్ర గర్భంలో ఉన్న కొండ కొనలకు చిక్కుకొని, చిరిగిపోతాయి. ఇలా టన్నులు కొద్ది ప్లాస్టిక్ వలలు సముద్రంలో చేరుతుందని చెబుతున్నారు యానిమల్ వారియర్స్ సంస్థకు చెందిన యువకులు. ఇలా సముద్రంలో చేరిన ప్లాస్టిక్ వలల్లో జీవరాశులు చిక్కుకుని అంతరించిపోతున్నాయని చెబుతున్నారు.
అంతేకాకుండా బీచ్ ప్రాంతాల్లో ప్రజలు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వారియర్స్ సంస్థ వారు చెబుతున్నారు. పర్యావరణం కాలుష్యం కాకుడదనే ఉద్దేశ్యంతో మత్స్యకారులకు యానిమల్ వారియర్స్ సంస్థ వారు చైతన్యం కల్పిస్తుంటారు. బీచ్ ప్రాంతాల్లో ప్రజలు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో చేరుకుండా చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు తీర ప్రాంతాన్ని శుభ్రపరచటం, సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీయటం వంటి పనులు చేస్తూ సముద్రాన్ని కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఈ యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
"ప్రకృతిని, జీవరాసుల్ని పరిరక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యానిమల్ వారియర్స్ సంస్థలో రెండు, మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ప్రజలు, విద్యార్థులకు సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లాసిక్ వినియోగాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. సంవత్సరానికి 15 నుంచి 20 టన్నుల చిరిగిన వలల వ్యర్థాలు ఉంటాయి". - యానిమల్ వారియర్స్ సంస్థ యువకుడు
సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగం తగ్గించాలని, ఒకవేళ వినియోగిస్తే పునర్వినియోగం చేయాలని యువకులు కోరుతున్నారు. దీని ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్ చేరడాన్ని నిరోధించవచ్చని యానిమల్ వారియర్స్ సంస్థ యువకులు అభిప్రాయపడుతున్నారు.