Andhra Pradesh Vote on Account Budget: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను దాదాపు 3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో సమర్పించే అవకాశం ఉంది. అంచనాలు ఈ స్థాయిలో ఉన్నా, వాస్తవంగా ఆ మేరకు ఖర్చు చేయగల వనరులు సమకూరుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిసెంబరు ప్రారంభంలోనే బడ్జెట్ అంచనాలను స్వాగతించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చుకు తగ్గట్టుగా కొద్దిశాతం పెరుగుదలతో మాత్రమే అంచనాలు సమర్పించాలని కోరారు. కసరత్తు పూర్తయిన తర్వాత క్రోడీకరించిన మొత్తం దాదాపు 3 లక్షల 20 వేల కోట్ల రూపాయలుగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. రాబడులను సరిగా అంచనా వేసుకోలేకపోవడం, అభివృద్ధికి ఊతమిచ్చి ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వాస్తవాలకు, అంచనాలకు మధ్య సంబంధం ఉండటం లేదు. ఏ ఏటికాయేడు బడ్జెట్ స్వరూపం పెంచుకునే విషయంలో పురోగతి అంతంతమాత్రంగా ఉంటోంది.
2019-20 నుంచి 2020-21 నాటికి 2 శాతం తక్కువ మొత్తంతో బడ్జెట్ సమర్పించారు. ఆ తర్వాత సంవత్సరంలో 2 శాతం మాత్రమే అంచనాలు పెంచారు. 2022-23లో మాత్రం దాదాపు 11.7 శాతం మేర బడ్జెట్ అంచనాలు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల కనిపించింది. అయిదేళ్లలో సాధించాల్సిన స్థాయిలో ఈ బడ్జెట్ మొత్తంలో అభివృద్ధి కనిపించడం లేదు.
ఐటీ ఎగుమతుల్లో కనీసం ఒక్క శాతం కూడా ఏపీ నుంచి లేవు - ఈ దుస్థితికి కారణం ఎవరు?
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ మేరకు రాబడులు పెరిగితేనే బడ్జెట్ స్వరూపం పెరుగుతుంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఆదాయ ద్వారాలు తెరవకుండా, పారిశ్రామిక, సేవారంగం వృద్ధి చెందే కార్యకలాపాలు చేపట్టకపోవడంతోనే రాబడులు, వాటితోపాటే ఖర్చులూ పెరగలేదు. మొత్తం బడ్జెట్ స్వరూపాల్లోనూ పెద్ద మార్పులు కనిపించడం లేదు.
జగన్ సర్కార్ హయాంలో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఖర్చులు తక్కువే ఉంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 76 శాతం మాత్రమే ఖర్చు చేయగలిగారు. 2020-21, 2022-23 సంవత్సరాల్లో అంచనాలతో పోలిస్తే 83 శాతం ఖర్చుచేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 93 శాతం ఖర్చుచేసినట్లు చెబుతున్నా వాస్తవ లెక్కలు ఈసారి వెల్లడించాలి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 79 వేల 279.27 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టినా తొలి పది నెలల్లో 67 శాతమే ఖర్చుచేసినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. బడ్జెట్ అంచనాల్లో మూలధన వసూళ్లకు కాగ్ ఇచ్చిన లెక్కల్లో మూలధన వసూళ్లకు మధ్య దాదాపు 20వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది.
స్మార్ట్ సిటీలపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. మాటల్లోని అభివృద్ధి చేతల్లో ఏదీ..?