Andhra Pradesh Ministers details: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రమాణం తర్వాత ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో పార్టీకి విదేయులతో పాటుగా తొలి సారి గెలిచిన అభ్యర్థులకు సైతం మంత్రి పదవులు దక్కాయి.
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్రవేసిన కింజరాపు అచ్చెన్నాయుడు, చంద్రబాబు జట్టులో రెండోసారి చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఘన విజయం సాధించారు. బీసీ, మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించింది. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన, మంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, మరోసారి విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
జనసేనలో పవన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా పనిచేశారు. నెల్లూరు నగరం నుంచి గెలిచిన పొంగూరు నారాయణ మరోసారి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. 2014లోనూ ఆయన మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు.రాజధాని అమరావతి భూసమీకరణలో నారాయణ కీలక పాత్ర పోషించారు.
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనితకు చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కింది. మంత్రిగా ఆమె ప్రమాణం చేశారు. తొలిసారి పాయకరావుపేట నుంచి గెలుపొందిన ఆమె.. మరోసారి అక్కడి నుంచే విజయం సాధించారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ప్రజలపక్షాన పోరాడిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నరసాపురం Y.N. కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన, తెలుగుదేశం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఫరూక్ నాల్గోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన గెలిచిన ప్రతిసారీ మంత్రిపదవి దక్కించుకున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ మంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నుంచి గెలుపొందిన పార్ధసారధి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో ఉయ్యూరు, పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగానూ పనిచేశారు.
బాపట్ల జిల్లా రేపల్లె నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ప్రమాణం చేశారు. 2009లో మోపిదేవి వెంకటరమణ చేతిలో ఓటమి చవిచూసిన అనగాని...ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చి...తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఓటమి ఎరగకుండా వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిపదవి దక్కింది. తొలిసారి మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నుంచి హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న డోలా బాలవీరాంజనేయస్వామి మంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. శాసనసభ విప్‌గా, తి.తి.దే. బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. జనసేనలో కీలక నేతగా ఉన్న కందుల దుర్గేశ్.... తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి విజయం సాధించారు. తొలిసారి ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి గెలుపొందిన గుమ్మడి సంధ్యారాణి S.T. కోటాలో మంత్రిపదవి దక్కించుకున్నారు. తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేసిన ఆమె...గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గెలుపొందిన వాసంశెట్టి సుభాష్తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందించిన ఆయన తెలుగుదేశంలో చేరి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమేగాక మంత్రిపదవి దక్కించుకున్నారు.
కర్నూలు జిల్లా బనగానపల్లె నుంచి విజయం సాధించిన బీసీ జనార్దన్‌రెడ్డి తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండోసారి బనగానపల్లె నుంచే పోటీ చేసి గెలిచారు. కర్నూలు నుంచి విజయం సాధించిన T.G. భరత్ తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. యూకేలో ఎంబీఏ చేసి వచ్చిన ఆయన, తండ్రి టీజీ వెంకటేశ్ వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి తొలిసారి పోటీ చేసి గెలవడమే గాక మంత్రి పదవి దక్కించుకున్నారు సవిత. తొలిసారి ఆమె మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర కురబ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆమె గతంలో పనిచేశారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నుంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమేగాక, చంద్రబాబు క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి తొలిసారి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. వారి కుటుంబం తరతరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తోంది. దాదాపు 15 ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్‌రంగంలో పనిచేసిన శ్రీనివాస్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. భాజపా కోటా పదవి దక్కించుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన తొలిసారి గెలవడమే గాక, మంత్రి పదవి సైతం చేజిక్కించుకున్నారు.