Amigos Mining Royalty Receipts Scam : జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మైనింగ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ శాఖకు సమాంతరంగా కడపకు చెందిన గుత్తేదారు సంస్థ అమిగోస్‌కు రాయల్టీ వసూళ్లను అప్పగించారు. గత సర్కార్‌లో ఇసుక, మద్యం తరహాలోనే నగదు చెల్లింపులు మాత్రమే అనుమతిస్తూ క్వారీల యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేశారు.
పెట్రేగిపోయిన అమిగోస్ సంస్థ : అప్పటి వరకు ఖనిజాభివద్ధిశాఖ రాయల్టీ చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేవి. అమిగోస్ వచ్చిన తర్వాత స్వంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని రాయల్టీని నగదు వసూళ్లతో ఇష్టానుసారంగా దోచుకున్నారు. మరోవైపు తమ పేరుతో రాయల్టీ రశీదు సృష్టించి ఇతర ప్రాంతాల క్వారీల నుంచి డోలమైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు క్వారీ యజమానులు తెలిపారు.
"పెద్దవడుగురూలోని కిష్టపాడులో మైనింగ్ చేస్తున్నాం. అమిగోస్ సంస్థ వచ్చిన తర్వాత రాయల్టీ చెల్లింపులని నగదు రూపంలో స్వీకరించారు. మా పేరుతో ఇతరులకు అక్రమ రాయల్టీలు ఇచ్చారు. గతంలో రాయల్టీ చెల్లింపులన్ని ఆన్లైన్లో జరిగేవి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం." - నాయుడు, క్వారీ యజమాని
Amigos Minerals Victims in Anantapur District : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో డోలమైట్, స్టీటైట్ తవ్వకాలన్నీ భూగర్భ గనుల ద్వారానే జరుగుతున్నాయి. ఆయా చిన్న గనుల నుంచి ఏటా గరిష్టంగా 3500 టన్నులకు మించి తవ్వకాలు చేయలేరు. సుమారు 250 నుంచి 300 అడుగుల లోతు వరకు సొరంగ మార్గంలో వెళ్లి పనులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే అందులోకి నీరుచేరి తవ్వకాలు నిలిచిపోతాయి.
Illegal Mining in AP : అయితే ఇదే ఖనిజాన్ని కొన్ని సంస్థలు ఓపెన్ మైనింగ్ పద్దతిలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నాయి. ఇలా వచ్చిన ఖనిజాన్ని ఉక్కు పరిశ్రమలతో పాటు ఇతరత్రా భారీ పరిశ్రమలకు రోజూ పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. అయితే ఇందులోనూ అమిగోస్ అక్రమాలకు తెర లేపింది. భూగర్భ గనుల నుంచి తవ్వి రవాణా చేస్తున్నట్లుగా సంస్థ అక్రమ రాయల్టీ రశీదులు ఇస్తున్నట్లు క్వారీ యజమానులు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా ఉన్న లారీలకు లోడ్ చేసి పంపితే అందరికీ తెలిసిపోతుందని కర్ణాటక, తమిళనాడుల నుంచి లారీలను అద్దెకు తీసుకొని ఇతర క్వారీ యజమానుల పేరుతో అమిగోస్ సంస్థ అక్రమ రవాణా చేస్తుంది. దీంతో క్వారీల యజమానులంతా ఈ విషయంపై నిఘాపెట్టి అమిగోస్ అక్రమ రశీదులతో ఉన్న లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు మాత్రం ఆ సంస్థ పేరు చెప్పగానే కేసులెందుకని చర్యలు తీసుకుంటామని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఇలాగే లారీని అప్పగించామని అయినా ఇంకా కేసు నమోదు చేయలేదని క్వారీ యజమానులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న వారిపైనా ఇంకా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇప్పటికే అమిగోస్ అక్రమాలు, దౌర్జన్యాలతో చాలా నష్టపోయామని ఆ సంస్థపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని క్వారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా - కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగులోకి అమిగోస్ మినరల్స్ సంస్థ అక్రమాలు - Amigos Minerals Irregularities