AIIMS Provides Free Treatment to Patients in Mangalagiri : సుమారు ఐదేళ్ల కిందట గుంటూరు జిల్లా మంగళగిరిలో పురుడు పోసుకున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఇప్పటిదాకా 19.32 లక్షల మంది ఓపీడీలకు (పొరుగు సేవల రోగులు) సేవలందించింది. నిష్ణాతులైన వైద్య బృందం (Medical team), పారా మెడికల్ సిబ్బంది ఉండడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపుగా అన్ని వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. బోధన, శిక్షణ, పరిశోధనలే ప్రామాణికంగా ఉండే ఎయిమ్స్(AIIMS) నాణ్యమైన వైద్యసేవలకు ప్రసిద్ధి. వీటితోపాటు రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు ఇలా ప్రతీదీ రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. అత్యంత ఖరీదైన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సను ఉచితంగానే చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. లక్షలు వెచ్చించినా అసలు రోగ నిర్ధారణే కానివారు ఇక్కడి కొచ్చి వైద్యం చేయించుకున్న ఉదంతాలు ఎన్నో.
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital
మొత్తం పడకలు 960..
- ఇటీవల విజయవాడకు చెందిన శ్రీరాం, కోనసీమ జిల్లాకు చెందిన కె.గౌరీప్రసాద్ మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నారు. అనేక హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో భారీగా ఖర్చు పెట్టారు. కానీ వారి రోగం నయం కాలేదు. వీరు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. చివరకు మంగళగిరి ఎయిమ్స్‌లో చేరారు. వారి తల్లుల నుంచి వైద్యులు కిడ్నీ మార్పిడి సర్జరీ చేశారు. ప్రస్తుతం వారు ఇద్దరూ కోలుకుంటున్నారు.
- బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన 10 తరగతి విద్యార్థికి గుండెపోటు వచ్చింది. పరిస్థితి విషమించడంతో వైద్యుల బృందం 20 నిమిషాలపాటు సీపీఆర్ (CPR) చేయగా గుండెలో కదలిక వచ్చింది. తర్వాత సర్జరీ చేసి విద్యార్థి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గురువారం (అక్టోబర్ 3న) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
- తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన డ్రైవర్ మోకాలు పైభాగంలో క్యాన్సర్ కణాలు రావటంతో నడవలేక ఇబ్బంది పడ్డారు. చికిత్సకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు చెప్పగా ఎయిమ్స్‌లో చేరారు. క్యాన్సర్ కణాలను తొలగించిన ఇక్కడి వైద్యులు బయాప్సీకి (biopsy) సైతం ముంబయి పంపారు. ఇక్కడి డాక్టర్లు బృందం వైద్యం విషయంలో రాజీపడకుండా సేవలు అందిస్తున్నారు.
- కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు ముందుకొస్తేనే వెంటనే సర్జరీ చేస్తామని నెఫ్రాలజిస్టు ఆచార్య ఉత్తకుమార్ దాస్ వెల్లడించారు.
- ఒకసారి ఓపీకి వచ్చిన వారు 10 రూపాయలు చెల్లిస్తే చాలు. సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చినా తిరిగి యూజర్ ఛార్జీలు చెల్లించనవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందకర్ పేర్కొన్నారు.
- కిడ్నీ మార్పిడికి సంబంధించి సుమారు 3 నెలలు పాటు సేవలు పొందాల్సి ఉంటుంది. వారు ఇక్కడే ఉండటానికి వీలుగా కంపెనీ సామాజిక బాధ్యత కింద ఎవరైన దాతలు ముందుకొచ్చి ఓ భవనం నిర్మిస్తే రోగులకు ప్రయోజనకకరంగా ఉంటుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఓపీ సేవలు ప్రారంభం: 2019 మార్చి 12
పీఎం చేతుల మీదుగా జాతికి అంకితం: 2024 ఫిబ్రవరి 25