Tirupati Laddu Issue Updates : ఒక డెయిరీ మరో డెయిరీ నుంచి కిలో రూ.355కు ఆవు నెయ్యిని కొనుగోలు చేసి, టీటీడీకి కిలో రూ.319.80కి సరఫరా చేయగలదా? కిలోకు రూ.35.20 నష్టం భరించి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వస్తుందా? అసలు స్వచ్ఛమైన ఆవునెయ్యి కిలో రూ.355కు రాదు. అలాంటిది కిలో రూ.355కు కొని వేల కిలోమీటర్ల రవాణా ఖర్చులు భరించి, టీటీడీకి రూ.319.80కి సరఫరా చేసిందంటే దాని అర్థమేంటి? ఆ డెయిరీ యజమాని స్వామికి పరమభక్తుడైనా అయి ఉండాలి లేకపోతే ఆ నెయ్యిలో అన్యపదార్థాల్ని కలిపేసి భారీగా కల్తీ అయినా చేసుండాలి!
తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఇప్పటికే ఎన్‌డీడీబీ ల్యాబ్ గుర్తించింది. ఇప్పుడు కిలో రూ.355కు కొన్న నెయ్యి రూ.319.80కి సరఫరా చేశారని వెలుగులోకి వచ్చింది. ఆ నేతిని తీవ్రస్థాయిలో కల్తీ చేశారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంతకంటే పెద్ద మాఫియా ఎక్కడైనా ఉంటుందా? వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాటల్లో చెప్పాలంటే ఇందులో కల్తీ జరిగిందనడానికి సిట్లు, బిట్లు అవసరమా?
Tirupati Laddu Controversy Updates : టీటీడీకి దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ ముమ్మాటికీ కల్తీ నెయ్యే సరఫరా చేసిందనడానికి మరో బలమైన ఆధారం బయటకు వచ్చింది. అసలు ఏఆర్ డెయిరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. అది తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ నుంచి నేతిని కొనుగోలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసింది. మరి అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీలో తయారైందా అంటే అదీ కాదు.
తిరుపతికి 2,300 కిలోమీటర్ల దూరంలో నెయ్యి మాఫియాకి పేరు గాంచిన ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ. అక్కడి నుంచి వైష్ణవి డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసింది. దాన్ని తిరుపతికి 500 కిలోమీటర్ల దూరంలోని ఏఆర్ డెయిరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ వేరే ఇన్‌వాయిస్ నంబర్లతో తిరుపతికి పంపింది. భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ సగటున కిలో నెయ్యి రూ.355కి కొనుగోలు చేసి ఏఆర్ డెయిరీకి రూ.318.57కి సరఫరా చేసింది. అదే నెయ్యిని, అవే ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ టీటీడీకి కిలో రూ.319.80కి సరఫరా చేసింది. అంటే వైష్ణవి డెయిరీ ప్రతి కిలో నెయ్యికి రూ.36.43 నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డెయిరీకి విక్రయించింది. అదే ఏఆర్ డెయిరీ కిలోకి కేవలం రూ.1.23 లాభం వేసుకుని టీటీడీకి సరఫరా చేసిందన్నమాట!
రికార్డుల్లో మాత్రమే వైష్ణవి డెయిరీ భోలేబాబా డెయిరీ నుంచి కొన్నట్టు, వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ కొనుగోలు చేసినట్లు చూపించారు. ఆ రెండు డెయిరీలు కలిసే ఈ దందా నడిపాయని జరిగిన పరిణామాల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. భోలేబాబా డెయిరీలో డైరెక్టర్లుగా ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్‌లే వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2024 జనవరి 18న వైష్ణవి డెయిరీలో డైరెక్టర్లుగా చేరారు. దీన్ని బట్టి ఈ నెయ్యి సరఫరాలో ఎంత కథ నడిచిందో అర్థమవుతోంది.
Adulteration Ghee Case in Tirumala : రూ.355కి కొన్న నెయ్యి రూర్కీ నుంచి తిరుపతిలోని వైష్ణవి డెయిరీకి, అక్కడి నుంచి తమిళనాడులోని దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకీ అక్కడి నుంచి తిరుపతికి చేరేది. అనేక రాష్ట్రాలు దాటుకుంటూ 3,300 కిలోమీటర్లు పైగా ప్రయాణించి రూ.319.20కి టీటీడీకి చేరింది. అంటే ఎంత పెద్ద మాయాజాలం జరిగిందో అర్థమవుతోంది.
పాలకమండలి పెద్దలు కుమ్మక్కవకపోతే ఇంత జరిగేదా? : ఏఆర్ సంస్థ భారీగా కల్తీ చేసిన నెయ్యినే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అప్పటి టీటీడీ పాలకమండలి పెద్దలు కుమ్మక్కవకపోతే ఇంత భారీ కుంభకోణం ఎలా సాధ్యమవుతుంది? ఏఆర్ డెయిరీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టుల్లో బయటపడింది. దీంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ డెయిరీ కార్యకలాపాలపై ఆరా తీసింది.
ఆ డెయిరీ ఎక్కడి నుంచి నెయ్యి కొంటోంది, జూన్, జులై నెలల్లో ఆ డెయిరీకి ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్లాయి, వాటి ఇన్‌వాయిస్ నంబర్లు, ఏయే టోల్‌గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయనే దానిపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కూపీ లాగింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అధ్యయనం చేసి సర్కార్‌కు గురువారం సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో అనేక విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. డెయిరీ సంస్థలన్నీ కలసి మాఫియాగా ఏర్పడి అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలతో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి రుజువులు వెలుగులోకివచ్చాయి.
అడుగడుగునా మాయాజాలం : టీటీడీకి నెయ్యి సరఫరాలో ఏఆర్ డెయిరీ అనేక అవకతవకలకు పాల్పడినట్టు వాణిజ్య పన్నుల శాఖ పరిశీలనలో తేలింది. జూన్, జులై నెలల్లో వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీకి 5 ట్యాంకర్లు 8 ట్రిప్పుల్లో నెయ్యి సరఫరా చేశాయి. వాటిలో తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన నాలుగు ట్యాంకర్లు ఐదు ట్రిప్పుల్లోవైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీకి వెళ్లి అక్కడి నుంచి మళ్లీ తిరుపతికి చేరాయి. ఏపీ26 టీసీ 4779 రిజిస్ట్రేషన్ నంబర్ గల ట్యాంకర్ మాత్రం నేరుగా వైష్ణవి డెయిరీ నుంచి తిరుపతికి నెయ్యి సరఫరా చేసింది.
కానీ ఆ మూడు ట్రిప్పులు కూడా వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీకి వెళ్లి, అక్కడి నుంచి తిరుపతి చేరినట్టుగా ఇన్‌వాయిస్ నంబర్లు మార్చారు. కానీ ఆ ట్యాంకర్ మూడు ట్రిప్పులు తిరిగినట్టుగా చూపించిన తేదీల్లో పునబాక- దిండిగల్ మళ్లీ దిండిగల్- తిరుపతి మధ్యనున్న ఏ టోల్‌గేట్‌నూ దాటినట్టు నమోదవలేదు. దీంతో ఆ నెయ్యి నేరుగా వైష్ణవి డెయిరీ నుంచి తిరుపతి చేరినట్టు నిగ్గు తేలింది. దీన్నిబట్టి ఏఆర్ డెయిరీ తిరుపతికి సరఫరా చేసిన ప్రతి కిలో నెయ్యి బయటి నుంచే కొనుగోలు చేసిందన్న అనుమానాలు బయటపడుతున్నాయి. నెయ్యిని భోలేబాబా డెయిరీలోనే కల్తీ చేశారా లేక వైష్ణవి డెయిరీకి వచ్చాక కల్తీ చేశారా? ఏఆర్ డెయిరీకి వెళ్లాక కల్తీ చేసి పంపించారా అన్నది తేలాల్సి ఉంది.
కిలో రూ.355కి కొని - కిలో రూ.318.57కి విక్రయం! :
- భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ జూన్ నెలలో కిలో రూ.412 చొప్పున 19,500ల కిలోలు, కిలో రూ.403 చొప్పున 29,000ల కిలోలు, కిలో రూ.313.60 చొప్పున 1,58,500 కిలోలు కొనుగోలు చేసింది. జులై నెలలో కిలో రూ.403 చొప్పున 64,000 కిలోలు, కిలో రూ.412 చొప్పున 19,500 కిలోలు, కొనుగోలు చేసింది. అంటే సగటు ధర కిలోకి రూ.355.
- అదే వైష్ణవి డెయిరీ సంస్థ ఏఆర్ డెయిరీకి జూన్ నెలలో కిలో రూ.315 చొప్పున 16,700 కిలోలు, కిలో రూ.316.60 చొప్పున 34,265 కిలోలు సరఫరా చేసింది. జులై నెలలో కిలో రూ.334.39 చొప్పున 16,730 కిలోలు, కిలో రూ.316.60 చొప్పున 69,500 కిలోలు సరఫరా చేసింది. దీనిలో ఎక్కువ శాతం నెయ్యిని కిలో రూ.316 చొప్పున విక్రయించింది. సగటు ధర కిలోకి రూ.318.57.
దాటిన టోల్‌గేట్లు ఇవీ! : పునబాకలోని వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు గాదంకి, మహాసముద్రం, దానమయ్యగారిపల్లి, ఎల్‌అండ్‌టీ కృష్ణగిరి తోపూర్, ఒమలూరు, రాసంపాళయం, వేలన్‌చెట్టియార్ టోల్‌ప్లాజాల్ని దాటుకుని దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకి చేరాయి.మరికొన్ని ట్యాంకర్లు వేరే మార్గంలో ఎస్.వి.పురం, తళ్లికొండ, వణియంబాడి టోల్‌గేట్లను దాటుకుని వెళ్లాయి.
నిబంధనల్ని తుంగలో తొక్కిన టీటీడీ పాలకమండలి! : ఏఆర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును అడ్డగోలుగా అప్పగించడంలో అప్పటి టీటీడీ పాలకమండలి నిబంధనల్ని తుంగలో తొక్కిందని ఈ నివేదికను బట్టి అర్థమవుతోంది. తిరుమలకు 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డెయిరీల నుంచి మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. కానీ దీనిని సడలించిన పాలకమండలి దాన్ని 1,500 కిలోమీటర్లకు పెంచింది. తిరుపతికి 500 కిలోమీటర్ల దూరంలోని ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టినా ఆ నెయ్యి వచ్చింది మాత్రం 2,300 కిలోమీటర్ల దూరంలోని రూర్కీ నుంచి! దీన్ని బట్టే దీని వెనుక ఎంత పెద్ద కుంభకోణం ఉందో అర్థమవుతోంది.
365 రోజులు 450పైగా ఉత్సవాలు - ప్రతీరోజు పండగే - 450 FESTIVALS IN TIRUMALA