Fake Phone Call to Praja Bhavan Case : తెలంగాణ ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు మంగళవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్ అలియాస్ అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డయల్ 100కి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ నిందితుడిని నాంపల్లి పోలీసులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. మంగళవారం ఉదయం పంజాగుట్ట ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని కాసేపట్లో పేలుతుందని ఫోన్ చేసి నిందితుడు శివకుమార్ టెన్షన్ క్రియేట్ చేశాడు. భార్యతో గొడవ పడి మద్యానికి బానిసై డిప్రెషన్లో ఇలా చేశానని పోలీసులకు తెలిపాడు. గతంలో శివకుమార్ ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.