Ex Mining Director Venkata Reddy Remand Report : గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి రిమాండ్ రిపోర్టును అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి సమర్పించింది. 47 పేజీల రిమాండ్ రిపోర్టులో ప్రాథమిక విచారణలో ఏసీబీ గుర్తించిన అంశాలు, ఇసుక కుంభకోణంలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి తదితర వివరాలు ప్రస్తావించింది. వెంకటరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది.
వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు : వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ప్రభుత్వానికి 15 వందల 28 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉండగా 201 కోట్ల 66 లక్షలే జమచేసినట్లు వెల్లడించింది. జగనన్న ఇళ్ల కాలనీలకు 859 కోట్ల 72 లక్షలు, నాడు-నేడు కింద నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ బడులకు 71 కోట్ల 44 లక్షలు విలువైన ఇసుక సరఫరా చేసినట్లు లెక్కల్లో చూపించేసిందని పేర్కొంది. వాటి పేరిట 931 కోట్ల 16 లక్షల సొమ్ము ప్రభుత్వానికి కట్టకుండా సర్దుబాటు పేరిట దోచేసుకుందని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.
ఆ మొత్తాన్ని మినహాయించినా జేపీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 395 కోట్ల 96 లక్షలు చెల్లించాలని స్టాంపుడ్యూటీ, సకాలంలో వాయిదాలు కట్టనందుకు చెల్లించాల్సిన వడ్డీ, ఇతరత్రా కలిపితే ఆ సంస్థ ప్రభుత్వానికి 624 కోట్ల 82 లక్షల బకాయి పడిందని తెలిపింది. అయినా ఆ సంస్థ సబ్‌లీజుదారైన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజస్ సమర్పించిన 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేందుకు వెంకటరెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, వాటి ప్రతినిధులతో పాటు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని వివరిచింది. ఆ సంస్థలన్నింటికీ కలిపి అనుచిత లబ్ధి చేకూర్చారని తద్వారా రాష్ట్ర ఖజానాకు 2 వేల 566 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది.
అనధికారికంగా తవ్వకాలు : వెంకటరెడ్డి జేపీవీఎల్‌తో కుమ్మక్కై వారికి వందల కోట్ల లబ్ధి కలిగించారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఆ సంస్థ కట్టాల్సిన జీఎస్టీ వసూలు చేయకుండా 233 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూర్చారని వెల్లడించింది. ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు అప్పగించక ముందు ఏపీఎండీసీ తవ్వి తీసిన 130 కోట్ల 73 లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వితీసిన 39 కోట్ల 24 లక్షల విలువైన ఇసుకను జేపీవీఎల్‌కే అప్పగించేశారని తెలిపింది. ఆ మొత్తాల్ని వెంకటరెడ్డి దురుద్దేశపూర్వకంగానే ఆ సంస్థ నుంచి వసూలు చేయలేదని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇసుక రీచ్‌ల్లో ఉన్న ఏపీఎండీసీకి చెందిన 27 కోట్ల 35 లక్షల విలువైన వే బ్రిడ్జిలు, సీసీ టీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నింటినీ అప్పట్లో జేపీవీఎల్‌కు అప్పగించారని తెలిపింది.
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ - Venkata Reddy Arrest
ఒప్పందం ముగిసిన తర్వాత జేపీవీఎల్ వాటిని ఏపీఎండీసీకి అప్పగించలేదని వాటి విలువా చెల్లించలేదని పేర్కొంది. జేపీవీఎల్ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయినా నవంబరు వరకూ ఆ సంస్థే అనధికారికంగా తవ్విందని వెల్లడించింది. ఈ అక్రమ తవ్వకాలకు వెంకటరెడ్డి సహకరించారని ఆ సంస్థ 896 కోట్ల 47 లక్షల విలువైన 45 లక్షల 62 వేల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసిందని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది. ఆన్‌లైన్ పర్మిట్లు జారీచేయాలనే మార్గదర్శకాలు ఉండగా జేపీవీఎల్ వాటిని పాటించకుండా మాన్యువల్ లావాదేవీలు నిర్వహించిందని, అయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారని తెలిపింది.
వెంకటరెడ్డి సహకారంతోనే అక్రమాలన్నీ : ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, సరఫరా, విక్రయాలు చేపట్టే కాంట్రాక్టును 2021 మే నెలలో దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్‌లీజు అప్పగించేసిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. రెండేళ్లపాటు కార్యకలాపాలన్నీ టర్న్‌కీయే నిర్వహించిందని టెండరు నిబంధనలకు విరుద్ధమైన ఈ వ్యవహారానికి వెంకటరెడ్డి అక్రమంగా అనుమతిచ్చారని పేర్కొంది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు ఇసుక రీచ్‌ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయని తెలిపింది. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయని పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టాయని పేర్కొంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలన్నీ నిరాటంకంగా సాగాయని వివరించింది.
2023 డిసెంబరులో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జేసీకేసీ సంస్థ 155 కోట్ల 32 లక్షలు, ప్రతిమ ఇన్‌ఫ్రా 147 కోట్ల 90 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిపడ్డాయని పేర్కొంది. ఇసుక తవ్వకాల లీజు ఒప్పందం రిజిస్ట్రేషన్ స్టాంపుడ్యూటీ, ఇతర చట్టబద్ధమైన రుసుముల కింద ఈ రెండు సంస్థలు 30 కోట్ల 63 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నా ఆ సొమ్ము కట్టలేదని తెలిపింది. ఆ బకాయిలపై 24 శాతం వడ్డీ వసూలు చేయాలని, ఇవేమీ వసూలు చేయకుండా వెంకటరెడ్డి ఆ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారని వివరించింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ 3 సంస్థలకు కలిపి 717 కోట్ల 32 లక్షల రూపాయల జరిమానాలు విధించిందని అని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.