A Pregnant Woman Run into Forest : గిరిజన గ్రామాల్లో అంబులెన్స్ సిబ్బందికి ఇక్కట్లు తప్పటం లేదు. ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనా, గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా వెంటనే 108 కి ఫోన్ చేసి అంబులెన్స్‌ను సంప్రదిస్తారు. సమాచారం అందుకున్నా సిబ్బంది హుటాహుటిన బయలుదేరి కొండ మార్గాల గుండా ప్రయాణించి అతి కష్టం మీద గ్రామానికి చేరుకునే సరిగా అక్కడ పేషెంట్లు మాయమవుతారు. తాజాగా ఇలాంటి ఘటనే అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.
ఊరంతా వెతికినా కనిపించలేదు : జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన వంతల శ్రావణి గర్భిణి. గురువారం ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో 108కు ఫోన్ చేసి సంప్రదించారు. అదేవిధంగా సమాచారం అందుకున్న జీకేవీధి పీహెచ్‌సీ ఆరోగ్య సహాయకుడు సత్యనారాయణ, ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి, సచివాలయం ఏఎన్‌ఎం కుమారి ఆ గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో 108 రావడంతో ఆ శబ్దం విన్న గర్భిణి భయంతో గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలోకి పరుగులు తీసింది. అక్కడకి వచ్చిన వైద్య సిబ్బంది ఆమె కోసం ఊరంతా తిరిగి ఇంటింటికి వెళ్లి చూసినా కనిపించలేదు.
అంబులెన్స్‌గా సొంత కారు - గిరిజనుల వైద్యం కోసం ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
వాపోతున్న అంబులెన్స్ సిబ్బంది : చివరికి చేసేదేమీ లేక వైద్య సిబ్బంది గ్రామం నుంచి వెనుదిరిగారు. మళ్లీ అదే రోజు సాయంత్రం వైద్యసిబ్బందితోపాటు పీహెచ్‌ఎన్ ద్వారకామయి అంబులెన్స్‌లో గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో గర్భిణి ఇంటివద్దనే ఉంది. వైద్య సిబ్బంది ఆమెకు అవగాహన కల్పించడంతో ఆసుపత్రికి వచ్చేందుకు ఒప్పుకొంది. గర్భిణీని గూడెంకొత్తవీధి ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు అచ్యుత్, వినయ్ పరీక్షించి సుఖప్రసవం చేశారు. వైద్యసేవల కోసం గిరిజన ప్రజలు 108కి ఫోన్ చేస్తున్నారని దీంతో కొండమార్గాల గుండా అతికష్టం మీద అక్కడికి వెళ్తే పేషెంట్లు పారిపోతున్నారని అంబులెన్స్ సిబ్బంది వాపోతున్నారు.
"గుర్రాల గొంది గ్రామంలో ఓ గర్భిణీకు పురిటి నొప్పులు వచ్చాయని అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆమె కోసం కొండమార్గం గుండా అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నాం. తీరా అక్కడికి వెళ్తే పేషెంట్ అందుబాటులో లేరు. ఆమె కోసం గ్రామంలో ఎంత వెతికినా కనిపించలేదు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని కోరుతున్నాం." - 108 సిబ్బంది
రోడ్డు లేని కారణంగా నిలిచిన అంబులెన్స్ - మధ్యలోనే గర్భిణీ ప్రసవం - WOMAN DELIVERY ON ROAD