A Father Kills His Two Daughters By Pushing Them Into Canal : అప్పుల బాధలను భరించలేని ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో పాటు కాల్వలోకి దూకాడు. ఈ సందర్భంగా చిన్న కుమార్తె కాల్వలో పడ్డ వెంటనే పూర్తిగా మునిగిపోగా, పెద్ద కుమార్తె కాల్వలో పైకి తేలి నాన్నా, నాన్నా అంటూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది. దీంతో కుమార్తెను విదిలించుకుని బాలికను కాల్వ లోపలికి నెట్టి ఈత కొట్టుకుంటూ ఆ తండ్రి బయటకు వచ్చాడు. ఈ నివ్వెరపోయే ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
స్తోమతకు మించి అప్పులు : వినుకొండ గ్రామీణ సీఐ బి.ప్రభాకర్ తెలిపారు వివరాల మేరకు, పల్నాడు జిల్లా ఈపూరు మండలం వనికుంట గ్రామంలో ఒక దిన పత్రిక విలేకరి (ఈనాడు కాదు)గా పని చేస్తున్న నాగాంజనేయ శర్మ తన స్తోమతకు మించి అప్పులు చేశాడు. అయితే కొంతకాలంగా అప్పులిచ్చినవాళ్లు డబ్బులు అడుగుతుండటంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. అదేవిధంగా తన భార్య అనారోగ్యంతో చాలాకాలంగా మంచాన పడటంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో తన ఇద్దరు కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ప్రియుడితో భార్య పరార్.. కోపంతో ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన భర్త!
కాళ్లు పట్టుకున్న కనికరించలేదు : ఈనెల 21న తన ఇద్దరు కుమార్తెలు యామిని (10), కావ్య (7)ను ఆస్పత్రిలో చూపించాలంటూ తన బైక్పై ముప్పాళ్ల కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. కుమార్తెలతో సహా ద్విచక్ర వాహనాన్ని నేరుగా కాల్వలోకి పోనిచ్చాడు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తె కావ్య కాల్వలో పడిన వెంటనే పూర్తిగా మునిగిపోయింది. పెద్ద కుమార్తె యామిని కాల్వలో పైకి తేలి నాన్నా, నాన్నా అంటూ కేకలు వేస్తూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది. ఈ సందర్భంగా తన పెద్ద కుమార్తెను విదిలించుకుని బాలికను కాల్వ లోపలికి నెట్టి తండ్రి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాడు.
మళ్లీ కాల్వలోకి దూకిన తండ్రి : ఈ క్రమంలోనే అటుగా వస్తున్న పాల వాహనం వ్యక్తి ఈ ఘటన చూసి నివ్వెరపోయాడు. తన వాహనం ఆపి నాగాంజనేయశర్మ వద్దకు వెళ్లి ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేశావంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తాను సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి పిల్లలతో సహా కాల్వ లోపలికి వెళ్లిందని నాగాంజనేయ శర్మ బదులిచ్చాడు. తాను జరిగిన సంఘటన మొత్తం చూశానని, కావాలనే పిల్లలను కాల్వలోకి నెట్టావని పాల వాహనం వ్యక్తి నిలదీశాడు. తర్వాత పాల వాహనం వ్యక్తి ముప్పాళ్లకు వెళ్లి అక్కడ జరిగిన విషయం మొత్తం స్థానికులకు తెలిపాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే తండ్రి నాగాంజనేయ శర్మ మళ్లీ కాల్వలోకి దూకాడు.
ప్రాణం మీద ఆశలో కేకలు : కానీ ప్రాణం మీద తీపితో మళ్లీ ఈత కొడుతూ కాల్వ అంచు దగ్గరకు వచ్చి గడ్డి పరక పట్టుకుని గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న సమీప గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి వచ్చి అతన్ని బయటకు తీశారు. అనంతరం కాల్వలో గాలింపు చేపట్టి తన కుమార్తెలు యామిని, కావ్యల మృతదేహాలను బయటకు తీశారు. తన ఇద్దరు కుమార్తెలను నమ్మించి తెచ్చి ఉద్దేశపూర్వకంగానే కాల్వలోకి నెట్టి హత్య చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. గురువారం వినుకొండ కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ బి.ప్రభాకర్ తెలిపారు.
మదనపల్లె జంటహత్యల కేసు: మానసిక వైద్యశాల నుంచి నిందితులు డిశ్చార్జ్
పలకరించేందుకు వచ్చిన బావమరిదిని చంపిన బావ - ఆపై ఏం జరిగిందంటే !