Two Hundred Prisoners shifted from Visakha To Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి విశాఖ కేంద్ర కారాగారం నుంచి 200 మంది ఖైదీలను తరలించనున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలోని ఖైదీల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఓ ఖైదీకి సంబంధించిన కుటుంబీకులు జైలు ఎదుట నిరసన చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కారణాల నేపథ్యంలో కారాగారంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జైళ్ల శాఖాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అపరిమితంగా ఖైదీలుండమే కారణం: విశాఖ కారాగారం 980 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఇక్కడ రెండు వేల మందికి పైగా ఖైదీలున్నారు. అందుకు గాను 150 మంది సిబ్బంది ఉండాల్సి రాగా కేవలం 89 మంది మాత్రమే ఉండటం గమనార్హం. అందువల్ల ఖైదీల సంఖ్య తగ్గించే క్రమంలో 200 మంది శిక్ష ఖైదీలను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. ఈ విషయమై కోస్తాంధ్ర జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు.
విడతల వారీగా తరలింపు: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 1200 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 1280 మంది ఉన్నారు. ఇంతకు ముందు ఇక్కడ 1600 మంది ఖైదీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతిని ఏర్పాటు చేశారు. ఆ తరుణంలో విశాఖ నుంచి 200 మందిని ఇక్కడికి తరలించేలా చర్యలు తీసుకోనున్నట్లు డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో రోజుకు 40 నుంచి 50 మంది ఖైదీలను పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో విడతల వారీగా విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తామని స్పష్టం చేశారు. అలా తీసుకొచ్చిన ఖైదీలు తాత్కాలికంగానే రాజమహేంద్రవరంలో ఉంటారని, విశాఖ కారాగారంలో ఖైదీల సంఖ్య తగ్గిన అనంతరం వారిని తిరిగి అక్కడికి తరలిస్తామని డీఐజీ రవికిరణ్ వివరించారు.