Students Harassment on One Student in Gurukula In Kamareddy District : తోటి విద్యార్థుల వికృత చేష్టలతో ఓ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతి చదివే విద్యార్థిపై అదే తరగతికి చెందిన 15 మంది విద్యార్థులు ఇష్టా రీతిన ప్రవర్తించి తనపై దాడి చేస్తున్నారని తన తండ్రికి ఫోన్ చేసి వాపోయాడు. ఈ విద్యార్థులు రాత్రి తలుపులు మూసి దుస్తులు లేకుండా తనతో డ్యాన్స్ చేయిస్తారని, కొడుతున్నారని, దుప్పటి లాగేసి నిద్రలేకుండా చేస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే ‘రాత్రి నీ సంగతి చూస్తాం’ అని ఆ విద్యార్థిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దసరా సెలవులకు వెళ్లి వచ్చినప్పటి నుంచి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపాడు.
రాయలసీమ వర్సిటీలో ర్యాగింగ్ - అర్ధరాత్రి జూనియర్‌ను గ్రౌండ్లో పరిగెత్తించి కొట్టారు
ఆదివారం తన బంధువుల సాయంతో కొడుకును తండ్రి ఇంటికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థులు ఇలా ప్రవర్తించడంపై బాలుడి తండ్రి సెల్‌ఫోన్ ద్వారా ప్రిన్సిపల్‌ను సంప్రదించి ఆగ్రహం వ్యక్తం చేయగా విద్యార్థులను మందలించినట్లు సమాచారం. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విద్యార్థి తండ్రి తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని, బాలుడిని పిలిచి వివరాలు తెలుసుకొని తోటి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఇటీవల కర్నూలు జిల్లాలో సీనియర్ విద్యార్థులు జూనియర్‌పై దాడి చేసిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. రాయలసీమ విశ్వవిద్యాలయంలో సునీల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పలువురు సీనియర్లు పరిచయ వేదిక పేరుతో విద్యార్థిపై గురువారం అర్ధరాత్రి దాడికి దిగారు. క్రీడా మైదానంలో పరిగెత్తించడంతో పాటు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సునీల్‌ను తోటి విద్యార్థులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.