YS Sunitha Request : న్యాయాన్ని గెలిపించాలని కొంగుచాపి అడుగుతున్నాం అని వైఎస్ కుమార్తె సునీత కడప ఓటర్లను అభ్యర్థించారు. సౌభాగ్యమ్మ, విజయమ్మ, షర్మిల.. న్యాయం వైపే ఉన్నారన్న సునీత పార్టీలకతీతంగా అందరూ మాకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం జరిగే పోలింగ్‌లో కడప పార్లమెంట్ ప్రజలు న్యాయానికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని, న్యాయం కోసం పోరాడుతున్న ఆడబిడ్డల వైపు ప్రజలు ఉంటారన్న నమ్మకం ఉందని అన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో అది ప్రస్ఫుటం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మన, తన భేదం లేకుండా న్యాయం, ధర్మం వైపు నిలబడ్డామని వైఎస్ సునీత అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె ఈ పోరాటంలో ఇంటాబయటా అనేక విమర్శలు ఎదుర్కొన్నామని వెల్లడించారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడి భవిష్యత్తు గురించి జగన్ మాట్లాడుతున్నారని, అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్ అంటున్నారని సునీత మండిపడ్డారు. హత్య చేస్తున్నపుడు ఒక ప్రాణం పోతుందని ఆలోచించకుండా, ఆ హత్యకు కారణమైన వ్యక్తిని వెనుకేసుకురావడం బాధాకరం. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రిగా మీరు న్యాయం, ధర్మం వైపు ఉండాలి అంటూ జగన్‌కు హితబోధ చేశారు. పులివెందుల, కడప ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారన్న సునీత ప్రజల స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యామని తెలిపారు.
మాకు న్యాయం జరగాలని అందరి మనసుల్లో ఉందని, ఈ ఎన్నికల్లో కడప ప్రజల తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానంటూ హస్తం గుర్తుకు ఓటేసే న్యాయాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా అందరూ మద్దతివ్వాలని, కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారని నమ్ముతున్నానని అన్నారు. సౌభాగ్యమ్మ, విజయమ్మ, షర్మిల న్యాయం వైపే ఉన్నారని, న్యాయాన్ని గెలిపించాలని కొంగుచాపి అడుగుతున్నామని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను, షర్మిల న్యాయం వైపే నిలబడ్డామని గుర్తు చేసుకున్నారు.
మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ, మంచి చేయాలనుకోవడం కష్టమైన మార్గమని తెలిసినా మేం దాన్నే నమ్ముకున్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేం న్యాయాన్ని గెలిపించాలని వేడుకుంటున్నాం. జగన్ మోహన్ రెడ్డి అవినాష్‌రెడ్డిని, అవినాష్ రెడ్డి శంకర్‌రెడ్డిని సమర్థించడాన్ని గమనిస్తే వారంతా కూటమి అని తెలుస్తుంది. రాష్ట్ర ప్రజల్లో భయం గూడుకట్టుకుందని, ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అది తగ్గిపోయిందని సునీత అన్నారు.