YSRCP Leaders Attack on TDP Activist : అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలపై, అలాగే ఓటరు జాబితా పరిశీలించడానికి వెళ్లిన ప్రతినిధులపై అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. పైగా బాధితులపైనే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గం టీడీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ రౌడీలు అరాచకం సృష్టించారు. ప్రచారంలో పాల్గొన్న కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ బాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ ఎన్నికల ప్రచారానికి 12వ వార్డు సమీపంలో వాహనాన్ని అడ్డుపెట్టడంతో పక్కకు తీయాలని కోరిన టీడీపీ నేతలపై వైసీపీ రౌడీలు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ బాబు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రమేష్ బాబును అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రౌడీలను వెంట బెట్టుకొని ప్రచారం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో రౌడీల ద్వారా అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రమేష్ బాబుపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి అధికార పార్టీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సంస్కృతి కొనసాగితే వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు - టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకల దాడి - YCP ACTIVISTS ATTACK ON MAN
ఓటరు జాబితా పరిశీలిస్తుండగా దాడి : జిల్లాలోని ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ బూత్ కన్వీనర్ నాగభూషణం, అతని మిత్రుడు సంతోష్‌తో కలిసి బుధవారం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు తమను అడ్డుకున్నారని అనంతరం దాడి చేశారని తెలిపారు. టీడీపీ నాయకులు ఇటు వైపు ఎవరూ వచ్చిన అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాని అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బాధితుడు సంతోష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా ఓటర్ల పరిశీలనకు వచ్చిన టీడీపీ నాయకులే తమపై దాడి చేశారంటూ ఆధికార పార్టీ నాయకులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.