YSRCP Leaders Migration 2024 : వైఎస్సార్సీపీ రాజీనామాలు, వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు పార్టీ అధినేత, అధిష్ఠాన పెద్దల దర్శన భాగ్యం కూడా కొందరికి దక్కలేదు. మరోవైపు పార్టీ అధికారంలో ఉన్నా, క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో జనాలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిన స్థానిక సంస్థల ప్రతినిధులు. అభివృద్ధి వైపే తమ అడుగులు అంటూ ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు టీడీపీలో చేరితే, మరికొందరు జనసేనకు జై కొడుతున్నారు. మరోవైపు మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తీవ్ర అవమానాలకు గురైన నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు.
రాజీనామా అస్త్రాలు : కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), మద్దాలి గిరిధరరావు (గుంటూరు పశ్చిమ) ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి (కదిరి)ని గత నెల పార్టీ సస్పెండ్ చేసింది. ‘సిటింగ్ ఎమ్మెల్యేనైన నాకు టికెట్ ఇవ్వలేదు. ఐనా సరే అభ్యర్థి గెలుపు కోసం పని చేద్దామనుకుంటే వద్దని పార్టీనే పక్కన పెట్టింది. మళ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయలేదంటూ ఇప్పుడు సస్పెండ్ చేయడమేంటి? ఆ సస్పెన్షన్ లేఖను కూడా నాకు నేరుగా కాకుండా ఎక్కడో సోషల్ మీడియాలో బహిర్గతం చేయడమేంటి? రాజకీయాల్లోనే కొనసాగుతా, ఫోర్స్‌లా వ్యవహరిస్తా’ అంటూ సిద్ధారెడ్డి సొంత పార్టీపై ఒక రకంగా యుద్ధం ప్రకటించారు. 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా, వెంటనే వైఎస్సార్సీపీ పంచన చేరిన మద్దాలి గిరిధర్‌కు 2024 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపింది. దీంతో ఆయన అవమానభారంతో ఇటీవలే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు.
YSRCP Leaders Join to TDP and JanaSena : ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా మళ్లీ శాసనసభకే పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయణ్ని బలవంతంగా గుంటూరు లోక్‌సభ స్థానానికి పంపారు. ఆయన పరాజయం పాలయ్యారు. తర్వాత అప్పటి వరకూ ప్రాతినిధ్యం వహించిన పొన్నూరు నియోజకవర్గ పార్టీ బాధ్యత ఇవ్వకపోవడంపై కిలారి కినుక వహించారు. పార్టీ కోసం కష్టపడినవారికి, త్యాగాలు చేసినవారికి గుర్తింపు లేదంటూ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు.
పిఠాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా మొన్నటి ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని, రాజ్యసభ అవకాశం కల్పిస్తామని చెప్పి చివరికి ఏవీ ఇవ్వకుండా వదిలేసింది. దీంతో ఎన్నికల తర్వాత నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు వైఎస్సార్సీపీ అధినాయకత్వ తీరుపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు రాజీనామా బాటలో ఉన్నారు.
అవమానభారంతో - ఎన్నికలకు ముందే కొందరు : 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అప్పటి మంత్రి గుమ్మనూరు జయరాం, వైఎస్సాపర్సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఎలీజా, ఆర్థర్ అప్పటి ఎంపీలు బాలశౌరి, రఘురామకృష్ణరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ సంజీవ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి లాంటివారు వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పి బయటపడ్డారు. క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరిన వారం రోజుల్లోనే అవమానభారంతో ఆ పార్టీని వీడారు.
అప్పుడు దౌర్జన్యం చేసినచోట నుంచే ఇప్పుడు వలసలు : మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి వైఎస్సార్సీపీ పాల్పడింది. ఇతర పార్టీల వారు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా దౌర్జన్యకాండను కొనసాగించి ఏకగ్రీవాలు చేసుకుంది. కానీ ఇప్పుడు వలసల దెబ్బ ఆ పార్టీని వణికిస్తోంది. ఇప్పటికే మహా విశాఖ నగరపాలక సంస్థ, పుంగనూరు, కుప్పం వంటి మున్సిపాలిటీల్లో ఆ పార్టీ పతనం దిశగా వేగంగా పయనిస్తోంది.
కుప్పంలో కుదుపు : వై నాట్ కుప్పం అంటూ వైఎస్ జగన్ సహా ఆయన పార్టీ నాయకులు కొంతమంది మొన్న ఎన్నికల వరకూ విర్రవీగారు. కుప్పం నియోజకవర్గంలోని స్థానిక సంస్థలన్నింటినీ కైవసం చేసుకున్నాం ఇక అసెంబ్లీ సీటే తరువాయి అంటూ బీరాలు పలికారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అదే కుప్పం మున్సిపాలిటీలో ఐదుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గానికి చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులూ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో ఇంకా ఇలాంటి నేతలు అనేకమంది పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రకటించారు.
- మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడారు. గత నెల 21న వారిలో ఏడుగురు టీడీపీ, ఐదుగురు జనసేనలో చేరిపోయారు.
- 31 మంది కౌన్సిలర్లున్న పుంగనూరు మున్సిపాలిటీలో ఛైర్మన్ అలీం బాషా, మరో 12 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని జూన్ 25న కలిశారు. తామంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నామని వారు చెప్పారు.