YSRCP Appeasing Unsatisfied Leaders for Rajya Sabha Elections: తన మాటే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అంటూ, ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో సీఎం జగన్ సంచలనాలకు తెర తీశారు. కష్టకాలంలో తనతో నడిచిన వారికి సైతం మెుండి చేయి చూపించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన నేతలకు టికెట్ కేటాయించే అంశంపై, అసంతృప్తిని సైతం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది సిట్టింగ్ ఎంపీలపై వేటు వేసిన సీఎం జగన్, అసంతృప్తి నేతలను పట్టించుకోలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి టికెట్ భరోసా రాని నేతలు, ఆయా ప్రాంతాల్లో మార్పులపై అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా నేడు కర్నూలు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సీఎంవో నుంచి పిలుపు అందింది.
బుజ్జగింపుల పర్వం: రాజ్యసభ ఎన్నికల దృష్య్టా పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ బుజ్జగిస్తోంది. అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంకు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, సీఎంవోలో ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంకు వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ నిరాకరించారు. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించింది. కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు నిరాకరిస్తున్న జయరాం గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా గుమ్మనూరు జయరాంను వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించారు. ఆలూరు సీటు తనకే ఇవ్వాలని పట్టు పట్టినట్లు తెలిసింది.
'ఆలూరు టికెట్ గుమ్మనూరుకే కేటాయించాలి - అభ్యర్థిని మార్చితే ఓటమి ఖాయం'
అసంతృప్తి వీడేనా: గత నెల 12వ తేదీన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన విరూపాక్షిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి జయరాం గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్సీపీ పెద్దలు జయరాంకు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించినా ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆలూరు టికెట్ జయరాంకు కేటాయించాలని కార్యకర్తలు ఆందోళన నిర్వహించినా, అధిష్టానం పట్టించుకోలేదు. కానీ, తాజాగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మూడు రాజ్యసభ స్థానాలకు పోటీకి దిగడంతో, ఆ మూడు సీట్లను గెలిపించుకోవాలని సీఎం జగన్ సవాల్‌గా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ సీటు చేయి జారిపోతే పడే ప్రభావం దృష్ట్యా అసంతృప్తి నేతలతో సీఎం మంతనాలు ప్రారంభించారని, అందుకే జయరాంకు సీఎంవో నుంచి పిలుపు అందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మంత్రి సోదరుడి నుంచి రక్షణ కల్పించండి - ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు