Vijayawada Airport : 2025 జూన్ నాటికి విజయవాడ అంతర్జాతీయ టర్మినల్ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే విషయంలో ఆయా సంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా కనెక్టివిటీ పెంచాలని కోరారు. దేశంలోని ప్రధాన నగరాలకు విమానాల రాకపోకలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్వీసుల పెంపు ఉంటుందని, ఆ మేరకు విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
'విమానయాన శాఖ మంత్రిగా నేను చేసే పని అదే!'
విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్‌లోనే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు వెల్లడించారు. రూ.611 కోట్లతో పనులు ప్రారంభించగా కరోనా, రాష్ట్రంలోని ఇతర కారణాలతో పనులు ఆలస్యం అయ్యాయని వివరించారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభించక కూడా ఆలస్యం జరిగిందని, 2025 జూన్‌లోగా అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్లలో పౌరవిమానయాన రంగ మౌలిక వసతులు అభివృద్ధి చెందాయని, పదేళ్ల క్రితం రైల్వేశాఖకు డిమాండ్ ఉండేదని చెప్తూ ప్రస్తుతం విమానయాన రంగానికి డిమాండ్ ఉందన్నారు. పార్లమెంటులో ప్రతి సభ్యుడు.. విమానాశ్రయం అడిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
విజయవాడ అంతర్జాతీయ టర్మినల్ నిర్మాణం పూర్తి చేయడంపై మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. విజయవాడ నుంచి ముంబయికి 2 సర్వీసులు పునరుద్ధరించాలని బాలశౌరి కోరారు. అదే విధంగా విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి దిల్లీ, కలకత్తా, ముంబయికి విమానాలు నడపాలని కోరారు. దిల్లీ నుంచి విశాఖ, తిరుపతికి విమాన సర్వీసులు పెంచాలని మంత్రిని అడిగారు. విమాన సర్వీసుల పెంపులో మంత్రిత్వశాఖ జోక్యం చేసుకునే అధికారం లేదన్న కేంద్రమంత్రి.. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్వీసుల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. సర్వీసుల పెంపుపై విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని, మంత్రిత్వ శాఖ కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తుందని వెల్లడించారు.
ఏపీ ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది - టీడీపీ ఎంపీల హర్షం - TDP MPs Response on Budget