Ration Mafia : కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు అక్రమంగా నిల్వ ఉంచిన 215 కోట్ల విలువైన 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో గోదాములు, రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం శాంపిళ్లను ల్యాబ్ లో పరీక్షిస్తున్నట్లు చెప్పారు. అక్రమాల నియంత్రణకు కాకినాడ పోర్ట్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా వేల టన్నులు విదేశాలకు తరలుతోంది. ఇప్పటికే పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పలు గోదాముల్లో నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పలువురిపై కేసుల నమోదుకు ఆదేశించారు.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ బియ్యం సేకరణకు ప్రభుత్వానికి దాదాపు 40 రూపాయల వరకు ఖర్చవుతుండగా అక్రమార్కులు లబ్ధిదారులకు చేరకుండానే అడ్డదారుల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన బియ్యం కాకినాడ పోర్టు ద్వారా దేశ సరిహద్దులు దాటుతోంది. కొంత మంది సొంతంగా నౌకలు నడుపుతూ విదేశాలకు బియ్యం తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో దందా సాగిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా నెలకు 2.12 లక్షల టన్నులు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుండగా అందులో సగానికి పైగా మాఫియా సేకరిస్తోందని తెలుస్తోంది. అర్హతలేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం, కొందరు ఈ బియ్యం తినడానికి ఇష్టపడకపోవడం మాఫియాకు కలిసొచ్చింది. ఊరూరా దళారులను నియమించి కిలోకు 8 నుంచి 10 రూపాయలు చెల్లించి రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. సేకరించిన బియ్యం వివిధ మార్గాల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి సొంత షిప్పుల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దందాలో అక్రమార్కులకు అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు సమీపంలోని తమిళనాడు నుంచి సేకరించిన బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు తరలిస్తున్నారు.