Andhra Pradesh Land Titling Act : నాడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నేడు భూముల రీసర్వే.. అసలు ఏపీలో ఏం జరుగుతోంది. ఎన్నికల వేళ అధికార వైఎస్సార్సీపీ అధిష్ఠానం, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఈ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేసే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అందుకే జగన్ సహా మంత్రులు బుగ్గన, బొత్స, చివరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భూముల రీసర్వే కేంద్రమే చేయిస్తోంది అని చెప్తూ బుకాయిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ చట్టం అమలులో లేకపోవడం గమనార్హం. రుణాల సమీకరణకు ఇది సులువైన మార్గమని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ చట్టంతో మీ భూములకు కొత్త సమస్యలు! - AP LAND TITILING ACT 2023
జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం (Land Titling Act) ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. రైతులు, రియల్టర్లు, ఇళ్లస్థలాలు కొనుగోలు చేసిన వారంతా అయోమయానికి గురవుతున్నారు. కొత్తగా చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, కొత్త రికార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అస్తవ్యస్థ భూ లెక్కలతో సమస్యలకు పరిష్కారం చూపకపోగా కొత్త వివాదాలకు దారితీస్తుందని న్యాయవాదులు చెప్తున్నారు. రైతులు లేకుండానే అధికారులు రీసర్వే చేస్తుండడం భూ లెక్కల్లో గందరగోళానికి కారణమవుతోంది. జగనన్న భూరక్ష పథకం భూ భక్ష పథకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఎటు తిరిగి తమ కొంప ముంచుతుందోనన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లోను గుబులు రేపుతోంది.
'భూమి నీదే కానీ, మేం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం- నీదైతే నిరూపించుకో!' - Land Titling Right Act
"వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి బండలు వేశారు. , చివరకు ఈ బండలు, పుస్తకాలు తప్ప ఏమీ ఉండవు. జగన్ ఫొటోతో ఇస్తున్న భూ పాస్ పుస్తకాలు కనీసం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. కనీసం బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడవు. కేవలం జగన్ తన బొమ్మను అచ్చు వేసి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా పుస్తకాలతో అన్ని రకాలు సేవలు అందేవి కానీ, కొత్త పాస్ పుస్తకంతో ఎలాంటి ఉపయోగం లేదు. తెలంగాణలో కేసీఆర్ ధరణితో ఓడిపోయారు.. అలాగే సీఎం జగన్ కూడా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంతోనే భూస్థాపితం అవుతారు." - నారాయణ , సీపీఐ జాతీయ కార్యదర్శి
భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022!
తెలంగాణలో ఎం జరిగిందంటే! : వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్ ఉద్దేశం. కానీ, నిర్వహణ లోపాలు కొత్త చిక్కులు తీసుకొచ్చాయి. మాడ్యూళ్లపై అవగాహన లేమి, ఆపరేటర్ల తప్పిదాలు, పర్యవేక్షణ కొరవడడం వల్ల భూ యజమానులు అవస్థలు పడ్డారు. భూ రిజిస్ట్రేషన్ తప్ప సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోకపోవడం రైతుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ధరణి లోపాలను ఎత్తిచూపిన కాంగ్రెస్ భూమాత పోర్టల్ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణాల్లో ధరణి ప్రధాన కారణమని విమర్శకులు పేర్కొనడం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీలోనూ కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరిన్ని కొత్త సమస్యలను సృష్టించనుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా గందరగోళ ప్రకటనలు ఇవ్వడం ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం- భూ కబ్జాదారుల చుట్టమా? - Lawyers on Land Titling Act
భూమి ఒకరిదైతే యజమాని మరొకరు, ఆన్లైన్లో పేరు మరొకరిది. ఇదీ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి తీరు. భూ వివాదాల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ఎన్నో కొత్త సమస్యలకు దారి తీసింది. భూ మాయా ప్రపంచాన్ని తలపించింది. రైతుల సమస్యలు తీరలేదు, వివాదాలకు పరిష్కారం దొరకలేదు. పోర్టల్ ద్వారా ఆప్షన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదులు తీసుకోవడంతోనే సరిపెడుతోంది తప్ప వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయలేదన్నది ప్రధాన ఆరోపణ. చివరికి ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే జరుగుతుందనే వాదన వ్యక్తమవుతోంది.