INFRA Development IN AP : వస్తు తయారీ రంగంలో దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా పథకాన్ని తీసుకువచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. ఆ మేరకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించింది. పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ను గ్లోబల్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చే క్రమంలో రవాణా అభివృద్ధికి చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో దక్షిణ తూర్పుతీరమైన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
తూర్పున 975 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం. సమీపంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు.. మరో వైపు గోదావరి, కృష్ణా జీవ నదులు.. దక్షిణాన చెన్నై, పశ్చిమాన బెంగళూరు సహా, హైదరాబాద్ నగరాలు రాష్ట్రానికి అతి చేరువలో ఉన్నాయి. వాణిజ్య పరంగా అనేక భౌగోళిక అనుకూలతలను కలిగిన రాష్ట్రం దేశ, విదేశీ వర్తక రవాణా అనుసంధానానికి కేంద్ర బిందువులా కనిపిస్తోంది. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ జీవనాడి కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయడం గమనార్హం.
ఇలా చేస్తే.. ఏపీలో ఆహార పరిశ్రమ రంగం పరుగులు - Food processing industry
పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామిక వృద్ధికి అనువైన వాతావరణం, వనరులు, సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో తయారీ రంగాన్ని ప్రేరేపించే దిశగా రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యూహంతో ఓడరేవులు, జాతీయ రహదారులు, రైలు - రోడ్డు వసతుల కల్పనకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ప్రక్రియలో విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై అందరి దృష్టి నెలకొంది. దేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగలిగిన ఈ కారిడార్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు, పారిశ్రామిక కారిడార్లు కీలక భూమిక పోషిస్తాయి. పారిశ్రామిక అభివృద్ధిలో రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్తు, గ్యాస్, బొగ్గు, ఇంధన వనరులు, గిడ్డంగి సౌకర్యాలు, బ్యాంకింగ్ సదుపాయాలు, వర్తక సౌకర్యాలు, మార్కెటింగ్ తదితర అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇవేగాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీమా సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వాడకం కూడా అవస్థాపన సౌకర్యాలే. గతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించేది. 1991 ఆర్థిక సంస్కరణల ఫలితంగా సౌకర్యాల కల్పన, విస్తరణలో విదేశీ సంస్థల పెట్టుబడులు పెరిగాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP, BOT) సమర్థమైందిగా గుర్తించి పన్ను, వడ్డీ రాయితీలు, డివిడెండ్ చెల్లింపు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో 1997లో రూ.5వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాల కల్పనకు ఎంతగానో ఉపయోగపడింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫ్రా అభివృద్ధి..
1973లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఏర్పాటైంది. పారిశ్రామిక వాడల అభివృద్ధికి భూ సేకరణ, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, నీటి సరఫరా లాంటి వసతుల కల్పన ఏపీఐఐసీ విధులు. సాధారణంగా పారిశ్రామిక క్షేత్రాలు 15 నుంచి 2500 ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. వీటికి అనుమతులతో పాటు పరిశ్రమల వ్యర్థాలను నియంత్రించే ఏర్పాట్లు కూడా ఏపీఐఐసీ చేపడుతుంది. సౌకర్యాల కల్పన, ఫైనాన్స్, పరిశ్రమల స్థలాల అభివృద్ధి, షెడ్ల నిర్మాణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు అందేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (APICDA) ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రధానంగా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు, అభివృద్ధి, భూ సేకరణ, కొనుగోలు, లీజు సౌకర్యాలు కల్పించడం ఏపీఐసీడీఏ ప్రధాన విధులు.
విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC)...
తూర్పు తీర ఆర్థిక కారిడార్ (ECEC) ఏర్పాటులో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) భాగస్వామిగా ఉంది. ECEC ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుల్లో విస్తరించింది. తూర్పు ఆసియాతో దేశాన్ని అనుసంధానం చేసేందుకు తూర్పుతీరం వెంట నౌకాశ్రయాలను అంతర్జాతీయ బహుళ మార్గాలుగా అభివృద్ధి పరిచేందుకు విశాఖ-చెన్నై కారిడార్ వ్యూహాన్ని రూపొందించారు. ఈ మార్గంలో వైజాగ్, మచిలీపట్నం, దొనకొండ, ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతాలను నోడ్స్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు భూముల కేటాయింపు సహా మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడుల అనుకూల వాతావరణం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సృష్టిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2018లో ఆంధ్రప్రదేశ్ 98.42% స్కోర్‌తో దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ప్రపంచబ్యాంకు నివేదికలు వెల్లడించాయి. విశాఖ-చెన్నై కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) దాదాపు 620 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ కారిడార్‌లో కొప్పర్తి, చిత్తూరు పారిశ్రామిక ప్రాంతాలను నోడ్స్‌గా ఎంపిక చేశారు.
చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (CBIC)ని కేంద్ర ప్రభుత్వం మెగా ప్రాజెక్టుగా చేపట్టింది. తమిళనాడులోని చెన్నై, శ్రీ పెరంబుదూర్, పొన్నపంతనంగల్, రాణిపేట, వేలూరు సమీప ప్రాంతాలతోపాటు ఏపీలోని చిత్తూరు, బంగారుపాళ్యం, పలమనేరు మీదుగా కర్ణాటకలోని బంగారుపేట, హోస్‌కోట్, బెంగళూరు ప్రాంతాలకు ఈ కారిడార్ విస్తరించింది. దక్షిణ భారత్ నుంచి దక్షిణాసియా దేశాలకు చెన్నై, ఎన్నూర్ నౌకాశ్రయాల ద్వారా వాణిజ్య సౌకర్యాలు విస్తరించడం ఈ కారిడార్ ప్రధాన వ్యూహం. CBICని తమిళనాడులోని కోయంబత్తూర్, కేరళలోని కొచ్చి నగరానికి కూడా విస్తరించడం గమనార్హం. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ట్రస్ట్ కనెక్టివిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 5 పారిశ్రామిక కారిడార్లలో దీనిని జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) సహకారంతో మూడు దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేస్తారు.
దిల్లీ-ముంబై పారిశ్రామిక అభివృద్ధి కారిడార్ (DMIDC) మాదిరిగా CBICని 100 బిలియన్ డాలర్లతో నిర్మించనున్నారు. 2020లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులో పొన్నేరి (తమిళనాడు), తుమకూరు (కర్ణాటక), కృష్ణపట్నం పోర్టు ప్రాంతం (ఏపీ) ప్రధాన నోడ్లుగా ఉన్నాయి. కృష్ణపట్నం నోడ్‌లో 2500 ఎకరాల్లో ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పూర్తి కావడంతో పాటు అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయి. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (HBIC) కారిడార్ మధ్య భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను దేశ తూర్పు తీర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. ఇందులో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు (9,800 ఎకరాలు) 11 గ్రామాలతోపాటు రైలు, రహదారి మార్గాల వెంట విస్తరించింది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా గుర్తింపు పొందింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని కాడెచ్చురు (6,500 ఎకరాలు) నోడ్ ఉంది.
2020-23 పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా ఫుడ్ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి జరగనుంది. ఇప్పటికే రాజాం మండలంలోని కాలువచెల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయగా పెద్దాపురంలో ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖ-చెన్నై కారిడార్ పరిధిలో చిత్తూరు నోడ్ (8,967 ఎకరాలు) ను ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌గా మారుస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం మునిమడుగు గ్రామంలో ప్రపంచబ్యాంకు గుర్తింపు పొందిన ఇండోస్పేస్ ఇండస్ట్రియల్ పార్కు నెలకొల్పగా ఇదే పారిశ్రామిక కారిడార్‌లో బర్జర్ పెయింట్స్, పేజ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ లాంటి సంస్థలను నెలకొల్పారు. దక్షిణకొరియా తదితర దేశాలు పెట్టుబడి అందించిన ఈ పార్కుకి 29 ఎకరాలు కేటాయించారు. ఏపీలో వాణిజ్య పరంగా అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల పరిశ్రమలు అనేకం ఉన్నాయి. విశాఖ ఉక్కు, ఖనిజాలు, పెట్రోలియం, పాలిమర్స్, ఎరువులు, భారీ ఇంజినీరింగ్, నౌకా నిర్మాణం, ఫిషింగ్ చురుగ్గా జరుగుతున్నాయి.
"అది కదా రహస్యం" - కేంద్ర నిధులు రాబట్టడంలో చంద్రబాబు చాణక్యం - AP SPECIAL FUNDS IN BUDGET 2024