General Elections Nominations Process has Ended: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు అన్ని రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి 911 నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు 5 వేల 230 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించింది. నామినేషన్ల దాఖలుకు ఇవాళ తుదిగడువు కావటంతో అభ్యర్ధులంతా పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ నెల 26 తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు. నామినేషన్ల స్క్రూటిని అనంతరం రేపు మద్యాహ్నానికి అర్హులైన అభ్యర్ధుల జాబితాను రిటర్నింగ్ అధికారులు సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్ 29 తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదిగా ఈసీ పేర్కోంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల తుదిజాబితాను ఈసీ ప్రకటించనుంది.
25 పార్లమెంటు నియోజకవర్గాలకు గానూ 4 ఎస్సీ , 1 ఎస్టీ నియోజకవర్గాన్ని రిజర్వు చేశారు. అలాగే 175 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 29 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వు చేశారు. ఈ నియోజకవర్గాలన్నిటికీ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా ఏపీలో మే 13 తేదీన ఒకే దఫా పోలింగ్ జరుగనుంది. జూన్ 4 తేదీన ఎన్నికల లెక్కింపు ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది. జూన్ 6 తేదీనాటికల్లా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని ఈసీ ప్రకటించింది.
భారీగా నగదు స్వాధీనం: రాష్ట్రవ్యాప్తంగా ఈసీ నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకూ 165 కోట్ల రూపాయలు విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్నికల సంఘం విస్తృత తనిఖీలు చేపట్టింది. చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో 36 కోట్ల 89 లక్షలు రూపాయలు, 20 కోట్ల రూపాయలు విలువైన 6.62 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుంది. అలాగే 91 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు సీజ్‌తో పాటు 3 కోట్ల విలువైన ఉచితాలనూ అధికారులు జప్తు చేశారు. అత్యధికంగా అనంతపురం పార్లమెంటు పరిధిలో 30 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 8 కోట్ల 65 లక్షలు విలువైన వస్తువులు చెక్ పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ - ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై చర్చ - BJP Leaders Meet Chandrababu