CHANDRABABU REVANTH REDDY MEETING: విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ముఖ్యమంత్రుల చర్చలు సాగాయి. ఈ భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు తీసుకున్న సీఎంలు, న్యాయపరమైన చిక్కుల గురించి కూడా చర్చలు జరిపారు. చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
రండి రండి దయచేయండి! తమరి రాక మాకెంతో ఆనందం సుమండి! - AP and Telangana CMs Meeting
తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజు: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసిన తర్వాత సమావేశానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఇవాళ తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజని మంత్రి అనగాని అన్నారు. పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని, రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు గుర్తించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు.
కమిటీ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటాం: విభజన సమస్యలకు పరిష్కార మార్గాలను కమిటీల ద్వారా అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని, పదేళ్లుగా పరిష్కారం కాని అనేక అంశాలపై చర్చించామన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని అన్నారు. సమస్యల పరిష్కార మార్గాలపై వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీలో సీఎస్, ముగ్గురు సభ్యులు ఉంటారని వెల్లడించారు.
కమిటీ ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేస్తామని అన్నారు. మంత్రుల కమిటీ కూడా పరిష్కరించకుంటే సీఎంల స్థాయిలో భేటీలు ఉంటాయని తెలిపారు. కమిటీలు అనేక పెండింగ్ అంశాలపై చర్చిస్తాయని పేర్కొన్నారు. అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా చర్చిస్తామని స్పష్టం చేశారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్ తీసుకున్నామన్న భట్టి, సైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.
అమరావతి ORRప్రాజెక్ట్ - CRDAగేమ్ ఛేంజర్, మీ ఊరు నుంచి వెళ్తుందా? - Amaravati Outer Ring Road