గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేశ్ ఎన్నికల తర్వాత మరింత వేగం పెంచారు. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేశ్... నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేశ్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేశ్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా, యువనేత లోకేశ్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారు. సొంతనిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు.
తెలుగుదేశం మీసం తిప్పిన నారా లోకేశ్- సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన యువనేత
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయదుందుభి మోగించిన లోకేశ్ ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేశ్ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులకు జారీ చేసారు.
ప్రజల మనిషిగా ఎదిగిన నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక టీంను సైతం ఏర్పాటు చేయాలని లోకేశ్ నిర్ణయించారు. తాను అందుబాటులో లేని సమయంలో సైతం స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూసేలా ఒక బృందం ఏర్పాటు కానుంది. వివిధ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఇతర మంత్రులు, డిపార్ట్‌మెంట్స్ దగ్గరకు ఈ బృందం తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది.