Achchennaidu's Letter to APSRTC : తాడేపల్లిగూడెంలో తొలిసారి నిర్వహించిన 'జెండా' సభతో ఊపుమీదున్న తెలుగుదేశం-జనసేన కూటమి మరో సభ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. తొలి సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ఇరు పార్టీల శ్రేణులు తరలిరాగా రోడ్లన్నీ స్తంభించాయి. ఆర్టీసీ యాజమాన్యం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి సభకు సహకరించకుండా బస్సులు కేటాయించనప్పటికీ లక్షలాదిగా తరలివచ్చారు. చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు సభకు స్వచ్ఛందంగా సొంత వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎండలు మండుతున్న క్రమంలో రెండో సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
ఏపీ భవిత కోసమే ఉమ్మడి ప్రయాణం - ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో
మార్చి 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం-జనసేన సభకు బస్సులు అద్దెకు (Hire bus) ఇవ్వాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీఎస్ ఆర్టీసీకి లేఖ రాశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున మార్చి 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి సమావేశం నిర్వహించ తలపెట్టాయి. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు హాజరు కానున్నారు. ప్రజలు సమావేశానికి హాజరై తిరిగి వారి గృహాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం అత్యవసరమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు బస్సులు అద్దెకు ఇవ్వాలని ఎన్నో సార్లు కోరినా ఇవ్వలేదని గుర్తు చేస్తూ విమర్శించారు. అధికార పార్టీ సమావేశాలకు మాత్రం ఆర్టీసీ వారు బస్సులు పంపుతూ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. అధికార పార్టీకి మాత్రం అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తగదని హితవు పలికారు. ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించే నిమిత్తం అద్దె బస్సులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మరోసారి కోరుతోందన్నారు. ఆర్టీసీ అధికారులు చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలని పార్టీ తరఫున అచ్చెన్నాయుడు కోరారు.
దిల్లీలో చంద్రబాబు, పవన్ - అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు - ఎన్డీఏలోకి టీడీపీ!
అధికార పార్టీ సభలకు ఇష్టానుసారం బస్సులు కేటాయిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం తమ సభలకు మొండిచెయ్యి చూపటాన్ని టీడీపీ-జనసేన నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఎప్పటిలాగే తమకు ఆర్టీసీ బస్సుల కేటాయింపును నిరాకరిస్తే న్యాయపరంగా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేస్తున్న అధికారుల మాదిరే ఆర్టీసీ ఎండీ (RTC MD) కూడా భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. బస్సుల కేటాయింపు వ్యవహారంపై పక్షపాతం చూపుతున్నారని ఎన్నికల కమిషన్ కు కూడా లేఖ రాస్తామని ఇరు పార్టీల నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఎన్డీఏలోకి చంద్రబాబు- ఏపీలో టీడీపీ,జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ
దర్శి, రైల్వే కోడూరు నియోజకవర్గాల ఇంచార్జ్ లను తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ప్రకటించారు. దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గా గోరంట్ల రవి కుమార్, రైల్వేకోడూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ముక్కా రూపానంద రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
బీసీలకు అండ దండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 'డిక్లరేషన్'