Nilayapalem Vijay Kumar Comments on Jagan: ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఐటీ సంస్థలు తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. జగన్ రెడ్డి అప్పులు చేస్తే తాము పెట్టుబడులు తీసుకువస్తున్నామని అన్నారు. విన్ఫాస్ట్, మోగ్లిక్స్, వెర్మీరెన్ వంటి విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయన్నాయని వివరించారు. మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖలో టీసీఎస్ రానుందని విజయ్‌కుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము మీ రాష్ట్రానికి వస్తున్నామంటూ ఫాక్స్ కాన్ సంస్థ మంత్రి లోకేశ్‌తో భేటీ అయిందని అన్నారు.
ఫాక్స్ కాన్, ఆపిల్ తయారీ చేసే కంపెనీల గురించే అవగాహన జగన్‌కు లేదని విజయ్‌కుమార్ విమర్శించారు. పెట్టుబడుల గురించి జగన్ రెడ్డి ఏనాడూ ఆలోంచించలేదని వచ్చిన కంపెనీలు సైతం రాష్ట్రం నుంచి తరిమేశారని మండిపడ్డారు. జగన్ నిర్వాకానికి రాష్ట్రం నుంచి తరలిపోయిన లూలూ, ఫాక్స్ కాన్, అశోక్ లే ల్యాండ్ వంటి సంస్థలు తిరిగి వచ్చాయని అన్నారు. బ్రూక్ ఫీల్డ్, ఒబెరాయ్, గోద్రేజ్, అపోలో, జైరాజ్ ఇస్పాత్, యూట్యుబ్, గూగుల్, ఎక్స్ఎల్ఆర్ఐ (XLRI), సెల్కాన్ వంటి ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు నేడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టున్నట్లు వెల్లడించాయని తెలిపారు.
నాడు టీడీపీ ప్రభుత్వం ఎస్ఆర్ఎమ్, వీఐటీ, అమృత్ యూనివర్సిటీలను తీసుకువస్తే జగన్ రెడ్డి వాటికి రోడ్లు వెసిన పాపాన పోలేదని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. ఏ అమరావతిని జగన్ రెడ్డి విధ్వంసం చేశాడో అదే అమరావతికి కేంద్ర ప్రభుత్వం హామీ ప్రకారం 90 శాతం గ్రాంట్లుగా వరల్డ్ బ్యాంకు రూ. 15,000 కోట్లు ఇవ్వనుందన్నారు. పోలవరానికి రూ.2500 కోట్లు, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25వేల కోట్ల పెట్టుబడులు, 75వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించిందని అన్నారు.
మొత్తంగా 4 నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. ఇదే నిజమైన విజయదశమి పండుగ ఇదే సంపద సృష్టి అంటే అని విజయ్ కుమార్ అన్నారు.
TCS will be set up in Visakhapatnam: అందాల సాగర తీరానికి త్వరలోనే మరో మణిహారం రానుంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో విశాఖలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఏర్పాటు కానుంది. టీసీఎస్ రాకతో యువతకు 10 వేల ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. మంగళవారం ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈవీ, ఎయిరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. అదేవిధంగా స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని సంస్థ ఛైర్మన్ తెలిపారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌ను ఒప్పించి విశాఖకు టీసీఎస్ వచ్చేలా మంత్రి లోకేశ్ చేసిన కృషి సఫలమైంది.
లులు, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ తర్వాత ఏపీకి టీసీఎస్ రానుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచేందుకు ఇది తొలి అడుగని లోకేశ్ సామాజిక మాద్యమం ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. టీసీఎస్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందని ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పెట్టుబడి వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఆలయ అర్చకులకు గుడ్‌న్యూస్ - స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే