TDP Leaders Fires on YSRCP about Visakha Drug Case : విశాఖ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సార్వత్రిక ఎన్నికల తరుణంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ నాయకులపై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు : విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధికారిక ట్విటర్ (X) ఖాతాలో తన పేరుపై ట్వీట్ చేయడాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తప్పుబట్టారు. సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అధికారిక ట్విటర్ (X) ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోందని, నిజ నిర్ధరణ కాకుండానే తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆరోపణలు చేయడం ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
టీడీపీకి మరక అంటించాలని చూస్తున్నారు : విశాఖను గంజాయి రాజధానిగా చేసి డ్రగ్ మాఫియాకు కేంద్రంగా చేయడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందనడానికి రుజువు డ్రగ్ కంటైనర్ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. బ్రెజిల్ అధ్యక్షుడుకి ట్వీట్ చేసిన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డికి, సంధ్య అక్వా వారికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు గిరిధర్, విశాఖ పార్లమెంట్ కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో వీరికి ఉన్న సంబంధాలు కూడా బయటపడతాయన్న ఉద్దేశ్యంతోనే టీడీపీకి ఈ మరక అంటించాలన్న విమర్శలు చేస్తున్నారన్నారు.
గొడ్డలి ఘటన లాగే ఏమార్చే ప్రయత్నం జరుగుతోంది : వైఎస్సార్సీపీ విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చేసిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లోనే రాష్ట్ర అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారని సీబీఐ పేర్కొందని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు లేకుండా అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా అని ప్రశ్నించారు. గొడ్డలి ఘటన లాగే దీనిని కూడా ఏమార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీబీఐ వేగంగా దర్యాప్తు చేసి విచారణ ముగించాలని ఆయన కోరారు. అప్పుడే దీని వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని అన్నారు.
"విశాఖ కథా చిత్రమ్"లో అడుగడుగునా అనుమానాలే! - Visakha drug case
గంజాయి అక్రమ రవాణా చేసేది వైఎస్సార్సీపీ నాయకులు : జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతనే ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి మత్తులో ముంచారని, గంజాయి అక్రమ రవాణాకు గంజాయి దిగుమతికి వైఎస్సార్సీపీనే కీలకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ముఖ్యమంత్రి యువతను మత్తులో ముంచుతున్నారని విమర్శించారు. విజయవాడలో దొరికిన డ్రగ్స్ కూడా వైసీపీ నాయకులకు సంబంధించినవేనని ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. అత్యధికంగా విజయవాడ జైల్లో ఉండేదంతా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారేనని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసేది వైఎస్సార్సీపీ నాయకులు అరెస్ట్ అయ్యేది కూడా ఆ పార్టీ వారేనని పేర్కొన్నారు. దొరికిన డ్రగ్స్‌కు చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించడం దుర్మార్గమని ఖండించారు.
డ్రగ్స్‌పై లోతైన విచారణ : విశాఖ గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని, భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధారలోని బీజేపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారని, గంజాయిని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌పై లోతైన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ డగ్స్ వ్యవహరంపై కులాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదని అన్నారు. పురందేశ్వరికి, వారి బంధువులకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం బీజేపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రెజిల్ దేశాధ్యక్షునితో విజయసాయిరెడ్డికి ఏం పని : ప్రపంచమంతా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తాపత్రయపడుతుంటే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అనధికారిక డ్రగ్ సరఫరాలో ప్రపంచాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి అని, అలాంటి దేశాధ్యక్షునితో విజయసాయిరెడ్డికి ఏం పని అని నిలదీశారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనపుడు శుభాకాంక్షలు తెలిపి, ఇప్పుడు అదే దేశం నుంచి 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ వచ్చిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందని సోమిరెడ్డి ప్రశ్నించారు. కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో సమాజాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారని వెల్లడించారు.