Nandamuri Balakrishna Election Campaign in Hindupur : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హిందూపురం రూరల్ మండలం బాలంపల్లిలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనపై మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. హిందూపురం టీడీపీ అభిమానులు, మహిళలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ హూషారుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని బాలకృష్ణ అభ్యర్థించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అలాగే సీఎం జగన్‌పై తనదైన స్టైల్లో నిప్పులు చెరిగారు. తన పంచ్ డైలాగులతో అభిమానుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. సమర్థవంతమైన పాలన కావాలో రాక్షసుడి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేయాలని అన్నారు. సీఎం జగన్ నా దళితులు అంటూనే దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతకు ఉపాధి లేక నిరాశ నిస్పృహతో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీల మీద దాడులు, అత్యాచారాలు, మానభంగాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దుర్మార్గపు పాలనకు మనమంతా ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలని అన్నారు. ప్రతి తెలుగువారు జగన్‌ను ఇంటికి సాగనింపేవరకు నిద్ర పోకూడదని తెలిపారు. సమసమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్న బాలకృష్ణ వైసీపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం చాలా ముఖ్యమని సమర్థవంతమైన పాలన అందించే వ్యక్తికే మీ ఓటు వేయండని అన్నారు. మీ బాగోగులు చూడని వైసీపీ నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలలోకి వస్తే గట్టిగా నిలదీయండని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.