Chilakaluripet Sabha arrangements: తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు కుదిరాక రేపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఒకే వేదికమీదకు రానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీల నేతలూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో 13కమిటీలు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాయి. సభ ఏర్పాట్లు, మూడు పార్టీల సమన్వయంకు సంబంధించి నేతలు ఏర్పాట్లు పరిశీలించారు.
రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సభ కోసం పకడ్బందిగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అక్రమాలను మోదీ దృష్టికి తీసుకెళ్లెందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సీఎం జగన్ కబంధహస్తాల నుంచి ఏపీ బయటపడుతుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ కోసం బస్సులు కేటాయించే విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
2014లో మాదిరి 2024లో టీడీపీ జనసేన, బీజేపీ విజయం సాధిస్తుందని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కూటమి నేతలు కోసం 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారని పేర్కొన్నారు. రేపు ఎన్నికల కోడ్ కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కూటమి నేతలు 170 నుంచి 175 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటుగా దేశం వెలుపల సైతం ప్రజాగళం సభ కోసం ఎదురు చూస్తున్నారని నిమ్మల రామానాయుడు తెలిపారు. రేపు ప్రధాని మోదీతో పాటుగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని నేతలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కొండపి ఎమ్మెల్యే డా. డోల బాల వీరంజనేయ స్వామి అన్నారు. రేపు చిలకలూరిపేట జరగబోయే సభ కోసం ఆయన కొండేపిలో ప్రచారకార్యక్రమం నిర్వహించారు. మండలంలోని జడ్ మేకపాడులో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా గత టీడీపీలో జరిగినవేనని తెలిపారు. టీడీపీ హయాంలో జడ్ మేకపాడుతో పాటు 32 గ్రామాల రోడ్లకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు సీఎం కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సీఎం హోదాలో తొలిసారిగా నేడు ఏపీలో అడుగుపెట్టనున్న రేవంత్ రెడ్డి