Rowdy Sheeters Expelling from Kadapa District: వైఎస్సార్ జిల్లాలో జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారుల రంగం సిద్ధం చేశారు. జిల్లాలో 21 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై రౌడీషీట్ తెరిచిన పోలీసులు, 652 మందిని ముందస్తుగా అరెస్టు చేయనున్నారు. 131 మందిని గృహనిర్బంధం చేయనున్న పోలీసులు, కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి 21 మందిని జిల్లా బహిష్కరణ చేయనున్నారు.
శనివారం ఉదయం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రౌడీషీటర్లందరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు, శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లా వదలాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లకు నోటీసులు జారీ చేయగా, 110 మంది రౌడీషీటర్లను గృహనిర్బంధం చేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణ చేయనున్నారు. ఈ రౌడీలంతా శనివారం ఉదయం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో ఉండకూడదని ఉమ్మడి కడప జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది.
కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే జిల్లా బహిష్కరణ : డీఎస్పీ షరీఫ్ - Kadapa DSP on Counting Process
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ : వైఎస్సార్ జిల్లాలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా పోలీసుల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్, సీజ్ చేసిన సెల్ఫోన్లను తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జూన్ 4 నుంచి జిల్లాలో కఠినమైన కర్ఫ్యూ అమలులో ఉంటుందనీ, అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా ఎస్పీ సూచించారు.
జూన్ 6వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటాయన్న జిల్లా ఎస్పీ, ఎవరైనా బయటి వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు, పాత నేరస్థులకు ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రౌడీషీటర్లు, నాయకులను గృహ నిర్బంధం చేయడానికి నోటీసులు జారీ చేసిన పోలీసులు, వారంతా సంబంధిత ఆర్డీవో కార్యాలయాలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్: కౌంటింగ్ నేపథ్యంలో పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న వేంపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారాన్ని తెలపాలని చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, బాణసంచా, ఊరేగింపులు వంటివి చేయకూడదని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ : సీఈఓ మీనా - CEO Inspected Vote Counting Center